తెలంగాణ

telangana

కమలం ఆశలన్నీ ఇప్పుడు ఆ ఓబీసీ నేతపైనే!

By

Published : Jan 22, 2022, 9:27 AM IST

UP Election news: ఆయన ఒకప్పుడు తన వ్యూహచాతుర్యంతో ఉత్తరప్రదేశ్‌లో భాజపాను అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు. భాజపాలో కీలకమైన ఓబీసీ నేత. సీఎం పదవిని త్రుటిలో కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభ ముందు ఇన్నాళ్లూ మసకబారిపోయారు. కాలం మారింది, పరిస్ధితులు తిరగబడ్డాయి. ఆయన ఇప్పుడు యూపీ భాజపాలో యోగి కంటే కీలకంగా మారారు. మరి ఇంతకీ ఎవరా నేత.

keshav prasad maurya
కేశవ్​ ప్రసాద్​ మౌర్య

UP Election news: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీల కేంద్రంగా రాజకీయాలు ఊపందుకోవడం వల్ల ఉన్నట్టుండి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు భాజపాలో ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రస్తుతం సీఎం ఆదిత్యనాథ్‌ కంటే కూడా పార్టీలో ఆయనే కీలక వ్యక్తిగా మారారు! ప్రచార వేదికలపై ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫూల్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం తరఫున మౌర్య విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ అధిష్ఠానం అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.

కేశవ్‌ప్రసాద్‌ను ఉపముఖ్యమంత్రి స్థానానికి పరిమితం చేసింది. ఆపై యూపీలో యోగి ప్రభ ముందు మౌర్య మసకబారిపోయారు! అయితే ప్రస్తుత ఎన్నికల తరుణంలో యోగి మంత్రివర్గం నుంచి ఓబీసీ నాయకులు స్వామిప్రసాద్‌ మౌర్య, ధారాసింగ్‌చౌహాన్‌, ధరమ్‌సింగ్‌సైనీలు వైదొలిగి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గూటికి చేరడం.. కమలదళ సర్కారులో ఓబీసీలకు విలువ లేకుండాపోయిందని విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలతో భాజపా ఉలిక్కిపడింది. కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు ప్రాధాన్యం పెంచుతూ.. ఓబీసీలను మచ్చిక చేసుకొనే పని మొదలుపెట్టింది. యూపీలో ఓబీసీ జనాభా 45% ఉంటుందని అంచనా. అందులో ప్రధాన సామాజికవర్గమైన యాదవ్‌లు ఎస్పీకి అండగా ఉన్నారు. యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులను తనవైపునకు తిప్పుకొని 2017 ఎన్నికల్లో 403 సీట్లకుగాను భాజపా 312 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఓబీసీల్లో గట్టి పట్టున్న స్వామిప్రసాద్‌ మౌర్యను ఆ ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకోవడం కమలనాథులకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు స్వామిప్రసాద్‌ దూరమయ్యారు. తనతోపాటు మరికొందరు కీలక నేతలనూ ఎస్పీలోకి తీసుకెళ్లారు. ఫలితంగా భాజపా నైతిక స్థయిర్యం కాస్త దెబ్బతింది! వెంటనే తేరుకొని.. పరిస్థితులు చక్కదిద్దే చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా.. ఇప్పటివరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఓబీసీ నాయకులకు పెద్దపీట వేసింది. తొలి జాబితాలోనే ముఖ్యమంత్రి యోగి అభ్యర్థిత్వంతోపాటు కేశవ్‌ప్రసాద్‌ పేరునూ ప్రకటించింది.

మృదుభాషి.. విశ్వాసపాత్రుడు

Keshav Prasad Maurya: చిరునవ్వు, మృదుభాషణ కేశవ్‌ప్రసాద్‌ సహజ లక్షణాలు. అంతగా ఉద్వేగాలకు లోనుకారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం, అధిష్ఠానానికి విశ్వాసపాత్రుడు కావడం సానుకూలాంశాలు. స్వపక్ష నేతలతోపాటు మిత్రపక్షాలైన అప్నాదళ్‌, నిషాద్‌ పార్టీలతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. విశ్వహిందూపరిషత్‌తో ప్రారంభమైన ఆయన.. భాజపాలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు అడ్డంకులు ఎదురయ్యాయి. 2004లో మురళీమనోహర్‌ జోషి అలహాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాతకానీ ఆయనకు భాజపాలో ప్రవేశానికి మార్గం సుగమం కాలేదు. అప్పట్లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసిన కేశవ్‌ప్రసాద్‌.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. 2012 ఎన్నికల్లో శిరతు స్థానం నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఫూల్‌పుర్‌ లోక్‌సభ నుంచి గెలుపొందారు. 2017 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యూపీ భాజపా అధ్యక్ష స్థానానికి కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలని మోదీ, అమిత్‌ షాలు అన్వేషణ ప్రారంభించినప్పుడు వారి దృష్టి.. కేశవ్‌ప్రసాద్‌పై పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. యాదవేతర ఓబీసీలను ఆకర్షించేందుకు భాజపాకు బాగా ఉపయోగపడ్డారు. తాజా పరిణామాలతో ఇప్పుడు మళ్లీ కేశవ్‌ప్రసాద్‌కు ప్రాధాన్యం పెరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఇదీ చూడండి:'నేను కాక ఇంకెవరు?'.. యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక హింట్!​

ABOUT THE AUTHOR

...view details