తెలంగాణ

telangana

UP Election 2022: 'అఖిలేశ్​​ అధికారంలోకి వస్తే.. మళ్లీ గూండా రాజ్యమే'

By

Published : Jan 27, 2022, 9:47 PM IST

UP Election 2022 Shah
UP Election 2022 Shah

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మళ్లీ గూండాల రాజ్యం వస్తుందని ధ్వజమెత్తారు. ఎస్​పీ, బీఎస్​పీలు కుల, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించాయని ఆరోపించారు. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికలు 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్​ను నిర్ణయిస్తాయన్నారు.

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. తాజాగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సతువా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఆయనే స్వయంగా ప్రచార కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ గూండా రాజ్యమే వస్తుందని ఆరోపించారు.

UP Election 2022 Shah

సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ రెండూ వారసత్వ, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. గతంలో సమాజ్‌వాదీ సారథ్యంలోని ప్రభుత్వంలో గూండాలు రాజ్యమేలలేదా? బలవంతులు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదా? మహిళలు అవమానాలు ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. ఎస్పీ నేత అజంఖాన్‌పై నమోదైన కేసులకు సీఆర్‌పీసీలో సెక్షన్లు కూడా సరిపోలేదంటూ అమిత్‌ షా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై విమర్శలు చేస్తున్న అఖిలేశ్‌కు దాని గురించి మాట్లాడే హక్కులేదన్నారు.

'వారు కులాల కోసమే పని చేశారు'

భాజపా తిరిగి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం తమపై అవినీతి ఆరోపణలు చేయలేరన్నారు. భాజపాకు ముందు రాష్ట్ర ప్రజలు ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలను చూశారనీ.. కేవలం కులాల కోసమే వారు పనిచేశారంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వారి వద్ద ప్రణాళిక లేదన్నారు.

UP Election 2022 Amit Shah

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి సారథ్యంలోనే యావత్‌ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. భాజపా కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితమై పనిచేసే పార్టీ కాదనీ.. మొత్తం సమాజానికి చెందినదన్నారు. 2017లో రాష్ట్ర ప్రజలు కుల, వారసత్వ రాజకీయాలను తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా షా గుర్తుచేశారు.

సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల ఇళ్ల నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ నోట్ల కట్టలు బయటపడుతున్నాయనీ.. భాజపాపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్‌ హామీ ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామమందిరం, వారణాసిలో కాశీవిశ్వనాథ్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నామన్నారు.

ఈ ఎన్నికలు 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్

ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యే, మంత్రి లేదా ముఖ్యమంత్రిని నిర్ణయించేవి కావని.. రాబోయే 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని అమిత్ షా వ్యాఖ్యానించారు. భాజపా కంటే ముందు.. 20 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. మాఫియా పాలనే జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. బహిరంగ దోపిడీ యుగంగా అభివర్ణించారు.

చరణ్​ సింగ్​ స్ఫూర్తి: రాజ్​నాథ్​

రాజకీయాలలో మాజీ ప్రధాని చౌదరి చరణ్​ సింగ్​ తనకు ఆదర్శమని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. గాజియాబాద్​లో జాట్‌ల జనాభా ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం మోదీ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాట్​లను భాజపా ఎప్పుడూ దూరం పెట్టలేదన్నారు. తమ పార్టీ కులతత్వ రాజకీయాలను అతీతమని పేర్కొన్నారు. యోగి ప్రభుత్వంలో శాంతి భద్రతలు మెరుగుపడినట్లు చెప్పుకొచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:అసోం- అరుణాచల్​ సరిహద్దులో కాల్పుల కలకలం

ABOUT THE AUTHOR

...view details