దేశ రాజధాని దిల్లీలో రెండున్నరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది తన భర్తే అని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మంగోల్పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలిక తల్లి తన కుటుంబంతో గాజియాబాద్లోని లోనీ ప్రాంతంలో నివసిస్తోంది. ఈ ఏడాది జనవరి 4న ఆమె ఓ పని నిమిత్తం మార్కెట్కు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిపై ఆమె తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక తల్లి ఇంటికి తిరిగివచ్చే సరికి.. తన భర్త చిన్నారికి దుస్తులు వేస్తూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి జననాంగాల నుంచి రక్తస్రావం అయింది. అయితే, ఈ విషయం పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని అత్తమామలు బాలిక తల్లిని బెదిరించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
అయితే, చిన్నారి తల్లి జులైలో తన పుట్టింటికి వచ్చింది. అనంతరం ఓ సామాజిక కార్యకర్త ద్వారా మంగోల్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. పోక్సో చట్టంతో పాటు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముగిసిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని తెలిపారు. అయితే ఈ కేసును లోనీ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. అక్కడి పోలీసులే విచారణ జరుపుతారని తెలిపారు.
వివాహితపై సామూహిక అత్యాచారం..
బిహార్లోని అర్రియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక హత్యచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్తను ఓ కర్రకు కట్టేసి కొట్టారు. ఘటనాస్థలంలో ఒక నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..నర్పత్‌గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 32 ఏళ్ల ఓ మహిళ నివసిస్తోంది. శనివారం రాత్రి భోజనం చేసి కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ కేకలు విని అక్కడికి చేరుకున్న భర్తను ఓ కర్రకు కట్టేసి కొట్టారు. ఘటనాస్థలిలో స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జైలుకు తరలించారు.
కాశీ హిందూ వర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారయత్నం..
కాశీ హిందు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. సైబర్ లైబ్రరీలో చదువుకుంటుండగా.. ఓ విద్యార్థి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడు దూషించాడని, చేతులు పట్టుకుని లైబ్రరీ నుంచి బయటకు తోసేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత తాను మానసికంగా బాధపడ్డానని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని విద్యార్థిని తెలిపింది.