తెలంగాణ

telangana

Thane Cyber Fraud : భారీ సైబర్ మోసం.. పేమెంట్ గేట్​వే హ్యాక్.. రూ.16 వేల కోట్లు స్వాహా!

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 11:41 AM IST

Thane Cyber Fraud : మహారాష్ట్రలో జరిగిన ఓ సైబర్​ మోసం పోలీసులను విస్తుపోయేలా చేసింది. కొందరు వ్యక్తులు ఓ ప్రైవేటు సంస్థ నుంచి గత కొన్ని నెలలుగా రూ.16,180 కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Thane Cyber Fraud
Thane Cyber Fraud

Thane Cyber Fraud :మహారాష్ట్ర.. ఠాణెలోని ఓ చెల్లింపు సేవల(పేమెంట్ గేట్​వే) సంస్థలో జరిగిన సైబర్ మోసం పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఆ సంస్థ వ్యవస్థను హ్యాక్​ చేసిన దుండగులు.. వేల బ్యాంకు ఖాతాల నుంచి విడతల వారీగా రూ.16,180 కోట్లు దోచుకున్నారు. అయితే చాలా కాలంగా ఈ సైబర్ మోసం జరుగుతున్నప్పటికీ నిర్వాహకులు గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాల సేకరణలో ఉన్నారు.

ఇలా వెలుగులోకి..
ఠాణె-వాగ్లే ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఈ ఏడాది జూన్​ 16న రూ.25 కోట్ల దుర్వినియోగం జరిగిందని ఖానాపుర్ శ్రీనగర్​ పోలీస్​ స్టేషన్​లో నిర్వాహకులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తుండగా గుజరాత్​కు చెందిన ఇద్దరు వ్యక్తులను సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన తర్వాత రూ.1.39 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అనంతరం దర్యాప్తు కొనసాగిస్తూ.. బేలాపుర్​లో ఓ ప్రైవేటు కంపెనీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఐదుగురి పేర్లు బయటపడ్డాయి. జితేంద్ర పాండే, సంజయ్‌ సింగ్‌, అమోల్‌ అండాలే, అమన్‌ కేదార్‌, సమీర్‌ డిఘే అనే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరిలో ఇద్దరికి గతంలో వివిధ బ్యాంకుల్లో రిలేషన్‌షిప్‌, సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని గత కొన్ని నెలలుగా నిందితులు సైబర్​ నేరానికి పాల్పడుతున్నట్లు నౌపాడా పోలీస్​ ఇన్​స్పెక్టర్ సంజయ్ ధుమాల్ తెలిపారు.

అయితే ఈ కేసులో ఇప్పటివరకు తాము ఎవరినీ అరెస్టు చేయలేదని నౌపాడా పోలీసులు తెలిపారు. ఈ భారీ సైబర్​ రాకెట్‌ వెనుక మరికొందరి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సేకరించామని, వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని.. మిగతా నిందితులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని నౌపాడా పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చెల్లింపు సేవల సంస్థతో లావాదేవీలు జరిపిన వివిధ సంస్థలు, వ్యక్తులపై ఈ మోసం ప్రభావం పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ప్రాణ స్నేహితుడని నమ్మితే.. రూ.12.5 లక్షలు స్వాహా

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఆర్మీ కాంట్రాక్ట్, న్యూడ్‌ వీడియోలతో దోచేశారు..

ABOUT THE AUTHOR

...view details