తెలంగాణ

telangana

అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం - సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 11:58 AM IST

Updated : Nov 8, 2023, 6:57 PM IST

Telangana_High_Court_Notices_to_CM_Jagan
Telangana_High_Court_Notices_to_CM_Jagan

11:56 November 08

జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ

Telangana High Court Notices to CM Jagan: అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీఎం జగన్‌తోపాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య వేసిన పిల్‌ను.. తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల విచారణ వెంటనే చేపట్టేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని హరిరామ జోగయ్య కోరారు. రోజువారీ విచారణ జరిపి వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లోగా కేసులను తేల్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌... పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసులు పెండింగ్‌లో ఉండగానే మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జగన్ సిద్ధమవుతున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులపై కేసులను వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ... రాజకీయ నేతలు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యం చేస్తున్నారని హరిరామ జోగయ్య గుర్తు చేశారు. ఎలాంటి నేరచరిత్ర లేని నేతలను, మరీ ముఖ్యంగా సీబీఐ, ఈడీ కేసులు లేని వారిని ఎన్నుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కోరుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. అందువల్ల తమ ముఖ్యమంత్రిపై కేసులు ఉన్నాయా, వీగిపోయాయా అన్నది ఏపీ ప్రజలు చూడాలనుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. జగన్‌పై వ్యక్తిగత కేసుల విషయం ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డ రిజిస్ట్రీ... తుది నిర్ణయం తీసుకోవాలంటూ సీజే ధర్మాసనం ముందుంచింది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ N.V.శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనం సూచనల మేరకు పిటిషన్లో మార్పులు, చేర్పులతో హరిరామజోగయ్య మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో ఛార్జిషీట్లు ఎప్పుడు దాఖలయ్యాయి, ఎన్నేళ్లుగా విచారణ కొనసాగుతోంది, ఇప్పుడు ఏ దశలో ఉన్నాయనే విషయాలను న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వివరించారు. పిల్‌లో సవరణలకు అనుమతించిన ధర్మాసనం.... నెంబరు కేటాయించాలని రిజస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న జగన్‌తోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Nov 8, 2023, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details