తెలంగాణ

telangana

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. పిటిషన్లతో విచారణకు "అడ్డంకులు".. హైకోర్టులో సీబీఐ వాదనలు

By

Published : Apr 14, 2023, 7:56 AM IST

YS Viveka Murder Case Updates: Y.S.వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటున్నారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. హత్య కుట్రపై దస్తగిరి వాంగ్మూలంతో పాటు.. ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. Y.S.భాస్కర్‌రెడ్డి ప్రమేయం పైనా ఆధారాలు ఉన్నాయని.. దస్తగిరికి కోర్టు ఇచ్చిన ఉపశమనంపై ప్రశ్నించే అధికారం ఆయనకు లేదని వాదించింది.

YS Viveka Murder Case Updates
YS Viveka Murder Case Updates

పిటిషన్లతో విచారణకు "అడ్డంకులు".. హైకోర్టులో సీబీఐ వాదనలు

YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డి తండ్రి వైఎస్​ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై.. తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కుట్రలో భాగంగా నిందితులకు 45 లక్షల రూపాయలు ఎలా అందాయనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని.. హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అసలైన కుట్రదారులు తప్పించుకోకూడదన్న ఉద్దేశంతో విచారణ చేస్తున్నట్లు పేర్కొంది.

హత్య కుట్రలో వైఎస్​ భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. కేవలం దస్తగిరి వాంగ్మూలమే కాకుండా.. ఇతర ఆధారాలు కూడా ఉన్నట్లు వివరించింది. ఈ నెల 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించగా.. విచారణ ముందుకు సాగకుండా పలు పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేంద్రన్ తెలిపారు. దస్తగిరికి కడప కోర్టు ఉపశమనం కల్పించడాన్ని పిటిషనర్లు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు.

భాస్కర్‌రెడ్డి ప్రతిపాదిత నిందితుడేనని, క్షమాభిక్షను కేసులోని నిందితులు కూడా ప్రశ్నించలేరని అన్నారు. దస్తగిరికి క్షమాభిక్షపై నిందితుడు శివశంకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత హైకోర్టు విచారణ జరపవద్దని సీబీఐ కోరింది.

దస్తగిరి వాంగ్మూలం తప్ప Y.S.భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదించారు. మొదటి ఛార్జ్‌షీట్ వేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు చట్టవిరుద్ధంగా సాక్ష్యాలు సేకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందన్నారు. గూగుల్ టేక్​ అవుట్ ద్వారా భాస్కర్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఇక్కడే ఉండి మొబైల్ ఫోన్‌ను మరో వ్యక్తి ఎక్కడికో తీసుకెళ్తే అక్కడ ఉన్నట్లు కాదని వాదించారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు లోపభూయిష్టంగా జరుగుతోందని.. అసలైన నిందితులను పట్టుకునే దిశగా సాగడం లేదన్నారు. కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ వచ్చేలా సీబీఐ సహకరించిందన్నారు. ఈ పిటిషన్లపై ఈ నెల 17న వాదనలు కొనసాగనున్నాయి.

గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా:మాజీ మంత్రివివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దుకు సీబీఐ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుమలత విచారణను వాయిదా వేశారు. సీబీఐ గడువు కోరడంతో విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details