తెలంగాణ

telangana

'ఒక్క టవర్‌నే కూల్చేస్తాం.. ఒప్పుకోండి ప్లీజ్‌'

By

Published : Sep 29, 2021, 2:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రముఖ రియల్​ ఎస్టేట్​ కంపెనీ సూపర్​ టెక్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం.. 40 అంతస్తుల జంట భవనాలను 3 నెలల్లోగా కూల్చివేయాలని ఆదేశించగా.. అందులో ఒక్కదాన్నే కూల్చేసేందుకు అంగీకరించాలని ఇప్పుడు కోర్టును అభ్యర్థించింది.

noida twin towers
noida twin towers, నోయిడా ట్విన్​ టవర్స్​

నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేయాలంటూ గత నెల ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్‌ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, అందుకు న్యాయస్థానం అంగీకరించాలని అభ్యర్థించింది. తీర్పును తాము సవాల్‌ చేయడం లేదని, అయితే తీర్పును మార్చడం వల్ల కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందిగా ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి కట్టిన ఈ భవనాలను నిపుణుల పర్యవేక్షణలో మూడు నెలల్లోపు సొంత ఖర్చులతో సూపర్‌టెక్‌ కంపెనీయే కూల్చాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక, ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కొన్న వారికి బుక్‌ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది.

అయితే ఈ తీర్పుపై సూపర్‌టెక్‌ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్‌ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, రెండోదాన్ని అలాగే ఉంచుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

''ఒక టవరు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. అందుకే దాన్ని కూల్చొద్దు అనుకుంటున్నాం. పక్కనే ఉన్న మరోదాన్ని కూలుస్తాం. మేం సుప్రీం తీర్పును, న్యాయవ్యవస్థను సవాల్‌ చేయాలనుకోవట్లేదు. అయితే ఒక్క టవర్‌నే కూల్చడం వల్ల కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి. అంతేగాక, కూల్చివేసిన టవర్‌ ప్రాంతంలో గ్రీన్‌జోన్‌ను ఏర్పాటు చేస్తాం.''

- సూపర్​టెక్ లిమిటెడ్​

ఈ టవర్లలో మొత్తం 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. రెండు టవర్స్‌ మధ్య కనీస దూరం పాటించడం లేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ లేఖ రాసినా నోయిడా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ టవర్స్‌ నిర్మాణంపై రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏళ్ల పాటు న్యాయపోరాటం చేయగా.. భవనాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:ఆ 40 అంతస్తుల టవర్లు కూల్చేయండి: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details