తెలంగాణ

telangana

రాజ్యసభ పోరు రసవత్తరం.. రాజస్థాన్​ కాంగ్రెస్​లో చీలిక!.. ఝార్ఖండ్​లోనూ...

By

Published : May 31, 2022, 2:14 PM IST

Rajyasabha Polls: ఈసారి రాజ్యసభ ఎన్నికలు కూడా రసవత్తరంగా మారాయి. రాజస్థాన్​ నుంచి సుభాశ్ చంద్ర నామినేషన్​ దాఖలు చేయడం అనేక ఉహాగానాలకు తావిస్తోంది. భాజపా తరఫున ఇప్పటికే ఘన్​శ్యామ్ తివారీ పోటీ చేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థి సుభాశ్​ చంద్రకు కూడా ఆ పార్టీ మద్దతు ఇస్తుండటం చర్చనీయాంశమైంది. రాజస్థాన్​ నుంచి మొత్తం నాలుగు స్థానాలకే ఎన్నికలు జరుగుతుండగా.. ఐదుగురు అభ్యర్థులు నామినేషన్​ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు.. ఝార్ఖండ్​ రాజకీయాలూ చర్చనీయాంశమయ్యాయి.

RS Polls 2022
రాజ్యసభ పోరు రసవత్తరం

RS Polls 2022: రాజ్యసభ ఎన్నికలతో రాజస్థాన్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఐదుగురు నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, రణ్​దీప్​ సుర్జేవా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున ఘన్​శ్వామ్ తివారీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా ఎస్సెల్ గ్రూప్ అధినేత, ఎంపీ సుభాశ్ చంద్ర​ కూడా రాజస్థాన్​ నుంచి మళ్లీ పెద్దల సభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల సమర్పణకు చివరి రోజైన మంగళవారమే ఆయన నామినేషన్ దాఖలు. అయితే ఆయన భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ సుభాశ్​ చంద్ర గెలవాలంటే కచ్చితంగా మరికొంత మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. మరి కాంగ్రెస్​లో అసమ్మతి నేతల ఓట్లు సుభాశ్​కు పడతాయా, లేక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిస్తారా తెలియాల్సి ఉంది. భాజపా మరోసారి కాంగ్రెస్​లో చీలిక తెస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Rajasthan Rajyasabha Election: సుభాశ్ చంద్ర ప్రస్తుతం హరియాణా నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ భాజపా ఆయనకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు రాజస్థాన్​ నుంచి పోటీ చేసేందుకు మద్దతు ఇస్తోంది. సుభాశ్ నామినేషన్​కు ముందు రాజస్థాన్​ మాజీ సీఎం, భాజపా నేత వసుందర రాజే ఆయనను అసెంబ్లీ లాబీలో కలిశారు. మరికొంత మంది భాజపా నేతలు కూడా కూడా అక్కడికి చేరుకున్నారు.

రాజస్థాన్​ నుంచి ముకుల్​ వాస్నిక్, ప్రమోద్ తివారీ, రణ్​దీప్ సుర్జేవాలా వంటి సీనియర్లను అభ్యర్థులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్. అయితే వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడం వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసమ్మతి వ్యక్తం చేశారు. రాజస్థాన్​లో చాలా మంది నాయకులు ఉండగా.. ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం అశోక్ గహ్లోత్ సలహాదారుడు, స్వతంత్ర ఎమ్మెల్యే సన్యం లోధా ఈ విషయంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.

దీన్ని అవకాశంగా తీసుకున్న భాజపా.. తమ అభ్యర్థి ఘన్​శ్వామ్ తివారీతో పాటు మరో అభ్యర్థిని కూడా బరిలోకి దింపుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సుభాశ్ చంద్రకు మద్దతు ఇస్తోంది. అయితే ఆయన కూడా హరియాణాకు చెందిన వారు కావడం వల్ల స్థానికేతరుడి కిందకే వస్తారు. మరి భాజపా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

నిర్మలాసీతారమన్​ నామినేషన్​: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్​ను మరోసారి రాజ్యసభకు పంపుతోంది భాజపా. కర్ణాటక నుంచి ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు మాజీ సీఎం యడియూరప్ప ఆమెతో పాటు అసెంబ్లీకి వెళ్లారు. నామినేషన్​కు ముందు గావి గంగాధరేశ్వర ఆలయంలో నిర్మల ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిర్మలాసీతారమన్​ నామినేషన్
నిర్మలాసీతారమన్​ నామినేషన్

కాంగ్రెస్​కు షాక్..: ఝార్ఖండ్ నుంచి తమకు రాజ్యసభ స్థానం దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్​కు మిత్రపక్షం జేఎంఎం షాక్ ఇచ్చింది. తమ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. సీఎం హేమంత్ సోరెన్​ కొద్దిరోజుల క్రితం సోనియాతో భేటీ అయినప్పటికీ ఇలా జరగడం కాంగ్రెస్​ను నిరుత్సాహానికి గురి చేసింది. రాజ్యసభ అభ్యర్థి విషయంలో మిత్రపక్షాలు కాంగ్రెస్, జేఎంఎం సమష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ అలా జరగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు తెగదెంపులు చేసుకుంటాయని, ప్రభుత్వం కూలిపోతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. తమ పార్టీ అగ్రనేతలు, మిత్రపక్ష నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు ఝార్ఖండ్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ఉత్తర్​ప్రదేశ్ నుంచి 8 మంది భాజపా అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య, ఇతర సీనియర్ నేతలు సమక్షంలో వీరు నామపత్రాల సమర్పించారు. యూపీ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:భాజపాలోకి హార్దిక్ పటేల్.. ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్​కు ఇక కష్టమే!

ABOUT THE AUTHOR

...view details