తెలంగాణ

telangana

మిషన్ 2024: పవార్​, సిన్హా భేటీపై ఉత్కంఠ?

By

Published : Jun 22, 2021, 11:16 AM IST

Updated : Jun 22, 2021, 12:53 PM IST

దేశంలో భాజపా, కాంగ్రెస్​లకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రతిపక్షాలు ఒకే తాటిపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం దిల్లీలో ప్రతిపక్షాల్లోని కొన్ని పార్టీల నేతలు భేటీ కానుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాన్ని సీనియర్ నేతలు శరద్​ పవార్‌, యశ్వంత్‌ సిన్హాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

sharad pawar
మిషన్ 2024

మిషన్‌ 2024 పేరుతో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో అన్ని పక్షాలు ఏకం కానున్నట్లు తెలుస్తోంది. మంగళవారం.. దిల్లీలో ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. సీనియర్​ నాయకులు ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​పవార్, యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

మారుతున్న సమీకరణాలు..

  • ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​తో 10రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయాలకు ఇది ఆరంభమా? అనే చర్చ మొదలైంది.
  • బంగాల్ అసెంబ్లీ హోరాహోరీ పోరులో భాజపాను.. మమతా బెనర్జీ ఓడించడం ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాంటి పట్టుదలతో ఉన్న పార్టీలన్నీ మంగళవారం నాటి సమావేశంలో పాల్గొనడానికి సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాపై ప్రత్యామ్నాయ కూటమిని నిలబెట్టి అక్కడి ఫలితాలను భవిష్యత్తు కార్యాచరణకు వేదికగా మలచుకొనే ఆలోచనతోనే ఈ సమావేశానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
  • ఈ సమావేశానికి ఫరూక్ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), యశ్వంత్‌ సిన్హా (తృణమూల్‌ కాంగ్రెస్), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), డి.రాజా (సీపీఐ) వంటి 15 మంది నేతలు హాజరు కానున్నారు.
  • వీరితో పాటు మాజీ సీఈసీ ఎస్‌.వై.ఖురేషి, సీనియర్‌ న్యాయవాది కె.టి.ఎస్‌.తులసి, బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అక్తర్‌, ప్రీతీష్‌ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌ తదితరులు దీనికి హాజరవుతారని ఎన్​సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు.
  • అయితే మంగళవారం జరిగే ఈ భేటీకీ శత్రుఘ్న సిన్హా, మనీశ్ తివారీ హాజరు కావడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే వారు రాలేకపోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తొలుత మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం మొదలుపెట్టి క్రమంగా ఆయనను ఢీకొట్టే నేతను ఎంపికచేసే దిశగా ప్రతిపక్షాలు పయనించే అవకాశం ఉంది.

ప్రతిపక్షాల భేటీ కాదు..

రాష్ట్ర మంచ్ నాయకులతో ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సమావేశం కానున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్​ తెలిపారు. పవార్ అనుభవజ్ఞుడని.. దేశంలోని వివిధ అంశాలపై చాలా మంది ఆయనను సంప్రదిస్తుంటారన్నారు. ఇది ప్రతిపక్షాల భేటీగా తాను అనుకోవటం లేదన్నారు. ఎస్పీ, బీఎస్పీ, వైకాపా, తెదేపా, తెరాస పార్టీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనటం లేదన్నారు.

ఇదీ చదవండి :పవార్​తో పీకే రెండోసారి- సరికొత్త రాజకీయాలకు ఆరంభమా?

"దస్త్రాల్ని కాపాడని వారు దేశాన్ని రక్షిస్తారా?''

గతుకుల బాటలో కాంగ్రెస్‌.. పూర్వవైభవం దక్కేనా?

మోదీపై శివసేన స్వరం మారిందా?

Last Updated : Jun 22, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details