తెలంగాణ

telangana

కోర్టుల ప్రత్యక్ష ప్రసారంపై ముసాయిదా

By

Published : Jun 8, 2021, 6:53 AM IST

కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, చిత్రీకరణకు సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది సుప్రీం కోర్టు ఈ-కమిటీ. ఈ మేరకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర భాగస్వాములకు ఈ- కమిటీ ఛైర్మన్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ లేఖలు రాశారు.

supreme court, SC
సుప్రీం కోర్టు

న్యాయస్థానాల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకువచ్చే దిశలో మరో అడుగు ముందుకు పడింది. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, చిత్రీకరణకు (రికార్డింగ్‌)కు సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాను సుప్రీంకోర్టు ఈ-కమిటీ సోమవారం విడుదల చేసింది. ముసాయిదాలోని నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్‌ అంశాల్లో మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర భాగస్వాములకు ఈ-కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ లేఖలు రాశారు. ఈ నెల 30వ తేదీలోపు తమ అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు.

రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం న్యాయం పొందే హక్కులో కోర్టుల ప్రత్యక్ష ప్రసారం పొందే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత, న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి, విశ్వసనీయత పెంపునకు ప్రత్యక్ష ప్రసారం తోడ్పడుతుందని కమిటీ పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారాల నిబంధనల రూపకల్పనకు బొంబాయి, దిల్లీ, మద్రాస్‌, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో ఒక ఉప సంఘాన్ని ఈ-కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఉప కమిటీ విస్తృతమైన చర్చలు జరపడంతో పాటు స్వప్నిల్‌ త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంది.

ముసాయిదా ప్రకారం...

  • వివాహ, లైంగిక వివాదాలు, మహిళలు, చిన్నారులపై లైంగిక హింస, చిన్నారులకు సంబంధించిన కేసులు, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కేసులు, శాంతిభద్రతలకు భంగం కలిగించే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాల నుంచి మినహాయిస్తారు.
  • క్రిమినల్‌ కేసుల్లో క్రాస్‌ఎగ్జామినేషన్‌, సాక్షుల వాంగ్మూలం, సాక్ష్యాల నమోదును ప్రత్యక్ష ప్రసారం చేయరు.
  • వ్యక్తుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన అంశాలను ప్రసారం చేయరు.
  • కేసుల విచారణల్లో విచారణ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలా..? లేదా.. అందులో ఏ భాగాన్నైనా ప్రసారం చేయకూడదా అనే విషయంలో ధర్మాసనానిదే (బెంచ్‌) తుది నిర్ణయం. ఏ దశలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసే అధికారం ధర్మాసనానికి నేతృత్వం వహించే న్యాయమూర్తికి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిమోట్‌ సంబంధిత న్యాయమూర్తి వద్ద ఉంటుంది.
  • ప్రతి కోర్టులో ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణకు సంబంధించిన కంట్రోల్‌ రూం (డీసీఆర్‌) ఏర్పాటు చేయాలి.
  • ప్రతి కోర్టులోనూ ప్రత్యక్ష ప్రసారాలకు అయిదు దిశల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలి. అందులో ఒకటి ధర్మాసనం, రెండు, మూడు వాదప్రతివాదుల న్యాయవాదుల వైపు, నాలుగోది నిందితుని వైపు, అయిదు సాక్షి, ప్రతివాది వైపు ఉంచాలి.
  • కోర్టు కార్యక్రమాల సమయంలో ధర్మాసనం అనుమతి మేరకు న్యాయవాదులు, సాక్షులు, నిందితులు, కోర్టు అనుమతించిన ఇతరులు మైక్రోఫోన్లు వినియోగించవచ్చు.
  • ప్రత్యక్ష ప్రసారాలను వీక్షకులు, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాలకు చెందిన వారు, సాక్షులు, వాదప్రతివాదులు, న్యాయవాదులు వీడియో, ఆడియో రికార్డు చేయకూడదు. ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షిస్తారు.
  • న్యాయమూర్తులు వారిలో వారు మాట్లాడుకునే మాటలు, విచారణ సందర్భంలో న్యాయమూర్తి న్యాయస్థానం సిబ్బందికి ఇచ్చే ఆదేశాలు, న్యాయమూర్తులకు అందించే పత్రాలు, కార్యకలాపాలు సాగుతున్న సమయంలో న్యాయమూర్తి చేసే ప్రకటనలను ప్రసారం చేయకూడదు.

ఇదీ చదవండి:దిగొచ్చిన ట్విటర్‌.. మరికొంత సమయం కావాలని విన్నపం!

ABOUT THE AUTHOR

...view details