తెలంగాణ

telangana

పెళ్లి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. 17 మందికి గాయాలు.. పైకప్పు పూర్తిగా ధ్వంసం

By

Published : May 7, 2023, 10:31 AM IST

Updated : May 7, 2023, 11:14 AM IST

ఓ పెళ్లి ఇంట్లో​ తీవ్ర విషాదం నెలకొంది. బంధువులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఓ చెట్టుని ఢీకొని అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్​ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

UP Jalaun Road Accident Several Died And Injured
యూపీ జలౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 5గురు మృతి 17 మందికి గాయాలు

వివాహమై కొద్ది గంటలు కూడా గడవకముందే ఓ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ పెళ్లి బస్సు ముందు నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో చెట్టుని ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్​ సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని జలౌన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న మధుఘర్ ఠాణా పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఒరై ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు.

వాహనాన్ని తప్పించే క్రమంలో..
ఒరై హెడ్‌క్వార్టర్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని ఒరై-భింద్​ హైవేపై ఉన్న గోపాల్‌పురా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో పెళ్లి బస్సు చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. వీరంతా జిల్లాలోని మండేలా గ్రామానికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఇరాజ్ రాజా వెల్లడించారు. మృతులను కుల్దీప్(36), రఘునందన్ (46), సిరోభన్ (65), కరణ్ సింగ్ (34), వికాస్ (32)గా గుర్తించారు పోలీసులు. ప్రమాద సమయంలో బంధువులు గాఢ నిద్రలో ఉన్నారని.. బస్సు పైకప్పు పూర్తిగా లేచిపోయిందని తెలిపారు. బస్సు డ్రైవర్​ అతివేగం కూడా ప్రమాదం జరగడానికి ఓ కారణమని పోలీసులు భావిస్తున్నరు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రమాదానికి గురయిన పెళ్లి బరాత్​ బస్సు

సీఎం యోగి సంతాపం!
జలౌన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

పెళ్లికి వెళ్తుండగా.. 11 మంది..!
ఇటీవల అచ్చం ఈ తరహా ఘటనే ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో వెలుగు చూసింది. బుధవారం(మే 3న) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పదకొండు మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని జగతరా సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా కాంకేర్​ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : May 7, 2023, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details