తెలంగాణ

telangana

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి.. 19 మందికి గాయాలు

By

Published : Apr 2, 2023, 1:47 PM IST

ట్రక్కు, పికప్​ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, ముందు వెళ్తున్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Rajasthan road accident
Rajasthan road accident

రాజస్థాన్..​ జైపూర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పికప్ వ్యాన్​లో ప్రయాణిస్తున్నవారు హరియాణాలోని హిస్సార్​కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారు రాజస్థాన్​.. చురూలోని సలావర్ బాలాజీ ఆలయంకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

వైద్యులు మృతి..
మహారాష్ట్ర.. వార్ధాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. సమృద్ధి హైవేపై ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు వైద్యులు, మరో మహిళ ఉన్నట్లు గుర్తించారు. మాలేగావ్​కు చెందిన జ్యోతి క్షీరసాగర్​, అమరావతికి చెందిన ఫల్గుడి సుర్వాడే, భరత్ క్షీరసాగర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి గురైన కారు

బస్సు బోల్తా..
తమిళనాడులోని తంజావూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పర్యటకులంతా కేరళకు చెందిన వారని తెలిపారు. తమిళనాడులోని వేలంకన్నికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డవారిని తంజావురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బస్సులో మెుత్తం 51 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జవాన్ ఆత్మహత్య..
చండీగఢ్​లో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న ఓ సీఐఎస్​ఎఫ్ జవాన్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త బయటకు తెలియడం వల్ల ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మృతి చెందిన సీఐఎస్‌ఎఫ్ జవాన్​ను కర్ణాటకకు చెందిన నాగార్జునగా పోలీసులు గుర్తించారు. ఆదివారం వేకువజామున జరిగిందీ ఘటన. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జవాన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

వాహనాన్ని ఢీకొట్టిన కారు..
ఉత్తరాఖండ్ ఖటీమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజర్​ను ఢీకొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ఖటీమాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details