తెలంగాణ

telangana

ఈడీ ముందుకు రాహుల్​.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్​ పిలుపు

By

Published : Jun 12, 2022, 5:12 PM IST

national herald case ed: నేషనల్​ హెరాల్డ్​ మనీలాండరింగ్​ కేసులో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరుకానున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. ఈ విషయమై ఆదివారం పార్టీ నేతలు సమావేశమై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పలువురు నేతలు.

national herald case ed
national herald case ed

national herald case ED: నేషనల్​ హెరాల్డ్​ కేసుతో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెెస్​ సిద్ధమైంది. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సోమవారం ఈడీ ముందు హాజరవుతున్న సమయంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా.. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోని భాజపా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్​ ఆరోపించింది. విచారణ సంస్థలను ప్రతీకార చర్యలకు వినియోగించుకుంటున్నారని విమర్శించింది. దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిపి.. మీడియా సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్ర రాజధానుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఏఐసీసీ పేర్కొంది. దీనికోసం పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించింది. గోవాలో మధుయాష్కి గౌడ్​, దిల్లీలో సచిన్​ పైలట్ సహా పలువురు నాయకులను నిరసనలను చేపట్టాలని ఆదేశించింది. ఎంపీలు, వర్కింగ్​ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలంతా ఏఐసీసీ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నట్లు కాంగ్రెస్​ ప్రకటించింది. రాష్ట్రాల్లోని ఈడీ యూనిట్​ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

రాహుల్​ గాంధీ, సోనియా గాంధీకి సమన్లు జారీ చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తప్పుపట్టారు. వారిపై ఈడీ పెట్టిన మనీలాండరింగ్​ కేసు నిరాధారమైనదని చెప్పారు. రుణాలను ఈక్విటీలుగా మార్చడం సాధారణ ప్రక్రియ అని.. నేషనల్‌ హెరాల్డ్‌ విషయంలోనూ అదే జరిగిందని చిదంబరం అన్నారు. అసలు నగదు ఊసేలేని ఈ వ్యవహారంలో 'మనీలాండరింగ్‌' జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఈ వ్యవహారం "అసలు పర్సేలేని వ్యక్తి జేబు నుంచి పర్సు కొట్టేశారని కేసు పెట్టినట్లుగా ఉంది" అని ఎద్దేవా చేశారు.

"కేంద్రం విద్వేష రాజకీయాలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోంది. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్​ తలవంచదు అనడానికి చరిత్రే నిదర్శనం."

-సచిన్​ పైలట్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఈ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జూన్​ 2నే ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్​లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్​. షెడ్యూల్​ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్​ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని మళ్లీ సమన్లు పంపింది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ జూన్​ 8న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆమెకు జూన్​ 2న కరోనా సోకింది. ఈ మేరకు ఈడీకి లేఖ రాసిన సోనియా.. విచారణకు మరో మూడు వారాల గడువు కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ఈడీ.. జూన్​ 23న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

నేషనల్​ హెరాల్డ్​ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

ఇదీ చదవండి:సోనియా గాంధీకి అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

ABOUT THE AUTHOR

...view details