తెలంగాణ

telangana

ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?

By

Published : Sep 4, 2022, 1:16 PM IST

isro-pslv
isro-pslv

ఇస్రో కోసం పీఎస్ఎల్​వీ వాహక నౌకలను తయారు చేసే కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకుంది. ఇకపై ఈ కన్సార్టియం.. పీఎస్ఎల్​వీ రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని అధికారులు తెలిపారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో నమ్మినబంటు అయిన ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్​వీ తయారీ కాంట్రాక్టును హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్ఏఎల్), ఎల్‌ అండ్‌ టీ కన్సార్టియం దక్కించుకుంది. ఇస్రో అనుబంధ సంస్థ న్యూస్పేస్‌ ఇండియా... కాంట్రాక్టు కోసం హెచ్ఏఎల్, ఎల్‌ అండ్ టీ కన్సార్టియాన్ని ఎంపిక చేసింది. రూ.860 కోట్ల విలువైన 5 రాకెట్ల తయారీని ఈ రెండు సంస్థలు కలిసి చేపట్టనున్నాయి. పూర్తిస్థాయిలో పీఎస్ఎల్​వీ రాకెట్ల తయారీని కాంట్రాక్టుకు ఇవ్వడం ఇదే తొలిసారి.

ఈ మేరకు సర్వీస్ లెవెల్ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉందని.. న్యూస్పేస్‌ ఇండియా అధికారి తెలిపారు. రెండేళ్లలోపు తొలి రాకెట్‌ను కన్సార్టియమ్‌ అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ తయారీకి ఉపయోగించే 80 శాతం మెకానికల్‌ వ్యవస్థలు, 60శాతం ఎలక్ట్రానిక్‌ పరికరాలు వివిధ పరిశ్రమల నుంచే వస్తున్నాయి. మిగిలిన శాతం వ్యవస్థలు ఎంతో క్లిష్టమైనవి. ఇకపై హెచ్ఏఎల్, ఎల్‌ అండ్ టీ కన్సార్టియం పీఎస్ఎల్​వీ రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని న్యూస్పేస్‌ ఇండియా పేర్కొంది. జీఎస్ఎల్​వీ మార్క్‌ 3 ఉపగ్రహ వాహక నౌక తయారీని కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్టుకు ఇచ్చే ప్రణాళికలను ఇస్రో సిద్ధం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details