తెలంగాణ

telangana

'చలో దిల్లీ': షరతుల చర్చలకు రైతులు ససేమిరా

By

Published : Nov 30, 2020, 5:51 AM IST

Updated : Nov 30, 2020, 6:19 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' ర్యాలీ ఆదివారమూ కొనసాగింది. అయితే బురారీ మైదానానికి వెళ్తే చర్చలు జరుపుతామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. దిల్లీ సరిహద్దుల్లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగించారు. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించబోయేది లేదని తేల్చిచెప్పారు. డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని అన్నారు.

chalo delhi
షరుతులుంటే చర్చలకు రాలేమన్న రైతులు

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. రాజధాని సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు.. బురారీ మైదానానికి వెళ్తే చర్చలు జరుపుతామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. బహిరంగ జైలు లాంటి బురారీ మైదానానికి వెళ్లమని తేల్చి చెప్పారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళనను విరమించబోమని, దిల్లీలోకి వెళ్లే ఐదు ప్రవేశ మార్గాలను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పంజాబ్​, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపుర్ సరిహద్దుల్లో రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు.

సింఘు సరిహద్దు వద్ద రోడ్డుపై కూర్చున్న రైతులు

వదొంతులు నమ్మొద్దు... వాస్తవాలు చూడండి

రైతుల ఆందోళన గురించి 'మన్​కీ బాత్'​ వేదికగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వ్యవసాయ చట్టాల అమలుతో రైతులకు కొత్త హక్కులు, అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. దీర్ఘకాలంగా ఉన్న రైతుల సమస్యలకు ఈ చట్టాలు పరిష్కారం చూపిస్తాయని మోదీ పేర్కొన్నారు. 'వదొంతులు నమ్మొద్దు వాస్తవాలు చూడండి' అని ప్రజలను కోరారు. వ్యవసాయ చట్టాలు రైతులకు ఆయుధాలని ప్రస్తావించారు. సరుకు అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బుచేతికి వచ్చేలా ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు.

బురారీకి వెళ్తేనే...

రైతులంతా బురారీ మైదానానికి వేళ్తే.. వారి సమస్యలపై రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రుల బృందం సిద్ధంగా ఉందని హోంశాఖ స్పష్టం చేసింది.

ఈ ప్రతిపాదనపై దాదాపు 30 రైతు సంఘాలు సమావేశమై చర్చలు జరిపాయి. కేంద్ర హోంమంత్రి విధించిన షరతులతో కూడిన చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాయి. చర్చల కోసం ఇలాంటి షరతులు విధించి రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డాయి. బురారీలోని నిరంకారీ మైదానాన్ని బహిరంగ జైలుగా అభివర్ణించాయి. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ జరిపే వరకూ ఆందోళనలు ఇలాగే కొనసాగుతాయని, నిరసనలు మరింత ఉద్ధృతమవుతాయని తెలిపాయి. ఆందోళనలో రాజకీయ పార్టీ నేతలకు ప్రసంగించే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి.

రోడ్డుపైనే బైఠాయించిన రైతులు
ఛలో దిల్లీ ర్యాలీలో భాగంగా ...

రైతు సంఘాల నాయకుల స్పందన

" కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. షరతులు విధించి చర్చలు జరుపుతామని చెప్పి రైతులను అవమానించారు. దిల్లీలోకి వెళ్లే ఐదు ప్రవేశ మార్గాలను ముట్టడి చేస్తాం".

- సుర్జీత్ ఎస్ పుల్, పంజాబ్ భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు.

" కేంద్రం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది కానీ, ఇలాంటి షరతులతో కూడిన చర్చలకు రైతులు సిద్ధంగా లేరు "

- గుర్నం సింగ్ చధోని, భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా యూనిట్ అధ్యక్షుడు.

ప్రతిపక్షాల మాట..

మొదటి నుంచి వ్యవసాయ చట్టాలపై అసహనంతో ఉన్న కాంగ్రెస్​... కేంద్ర ప్రభుత్వం అధికార అహంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం రైతులతో త్వరితగతిన చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు. రైతులను దిల్లీకి అనుమంతించకపోవడం చాలా బాధాకరమని శివసేన తెలిపింది. మర్యాద పూర్వకంగా రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కోరింది.

బారికేడ్లు వేసి కాపు కాస్తోన్న పోలీసులు

డిసెంబర్​ 1 నుంచి మరింతగా...

చలో దిల్లీ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని రైతు సంఘాలతో ఏర్పాటైన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కోరింది. హోంశాఖ, నిఘా వర్గాల ద్వారా కాకుండా అత్యున్నత రాజకీయ నేతల స్థాయిలో చర్చలు జరగాలని డిమాండ్ చేసింది. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల పోరాట స్ఫూర్తిని అభినందిస్తూ... రైతులంతా పెద్ద సంఖ్యలో దిల్లీ చేరుకోవాలని పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

బారికేడ్లు వేసి రైతులను అడ్డుకునే యత్నం

అగ్రనేతల భేటీ...

దిల్లీలో రైతు నిరసనల తీవ్రత పెరుగుతున్న తరుణంలో భాజపా అగ్రనేతలు భేటీ అయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, నరేంద్ర సింగ్​ తోమర్​లు సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు.

ఇదీ చదవండి:విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్న స్వర్ణ దేవాలయం

Last Updated :Nov 30, 2020, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details