తెలంగాణ

telangana

'టీకాపై అపోహలు తొలగితేనే కరోనాపై విజయం'

By

Published : Jun 27, 2021, 11:20 AM IST

Updated : Jun 27, 2021, 1:10 PM IST

మనసులో మాట కార్యక్రమం (Mann Ki Baat) 78వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. కరోనా టీకాల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టీకాలపై ఉన్న అపోహలు విడనాడి.. ప్రతీఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు.

modi
మోదీ

దేశం మొత్తం కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోందని మోదీ తెలిపారు. ఈ పోరాటంలో అందరం కలసి కీలక మైలురాళ్లను అందుకున్నామని పేర్కొన్నారు. జూన్ 21న ఒకేరోజు రికార్డు స్థాయిలో టీకాలు పంపిణీ చేసి సరికొత్త మైలురాయిని అధిగమించామన్నారు. అయితే.. మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. పుకార్లను వ్యాప్తిచెందించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. టీకాలపై అపోహలు తొలగితేనే కరోనాపై విజయం సాధిస్తామని తెలిపారు. తనతో పాటు.. సుమారు 100 ఏళ్ల వయసున్న తన తల్లి టీకాలు తీసుకున్నట్లు చెప్పారు.

"కరోనా భయం పోయిందనే భ్రమలో ఉండకండి. సమాజంలో పుకార్లు వ్యాప్తి చేసేవారు చేస్తూనే ఉంటారు. కానీ మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. ఇది ఒక మహమ్మారి. దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సకాలంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలపై మనకు విశ్వాసం ఉండాలి."

-ప్రధాని మోదీ

మధ్యప్రదేశ్​ బేతుల్ జిల్లాలోని దులారియా గ్రామస్థులతో మాట్లాడి టీకాలపై వారికి ఉన్న సందేహాలను తొలగించినట్లు తెలిపారు. అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని సలహా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కరోనా సంక్షోభంలో ఎంతో సంయమనంతో వ్యవహరించారని మోదీ ప్రశంసించారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే క్షేత్రస్థాయి అవసరాలను తీర్చారని కొనియాడారు.

"గ్రామాల్లో సాధారణంగా ఇరుగుపొరుగుకు సహాయం చేసే గుణం ఎక్కువ. కరోనా విజృంభణలోనూ వ్యవసాయ పనులకు అంతరాయం కలగనివ్వలేదు. సమీప గ్రామాల నుంచి పాలు, కూరగాయలు సరఫరా అయ్యేందుకు సహకరించారు. తమ పనితో పాటు ఇతరుల పనిని చేసుకోనిచ్చారు."

-ప్రధాని మోదీ

దిగ్గజానికి నివాళులు..

మిల్కాసింగ్​ ప్రస్తావన లేకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుకోలేమని మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే మృతిచెందిన దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్​కి నివాళులు అర్పించిన మోదీ.. ఆయనను కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

"ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపిక్స్​కి సన్నద్ధమవుతున్న భారత అథెట్లకు మార్గదర్శనం చేయాల్సిందిగా, వారిలో ఉత్సాహం నింపాల్సిందిగా కోరాను."

-ప్రధాని మోదీ

ఒలింపిక్స్.. ఏళ్ల ప్రతిభ..

టోక్యో ఒలింపిక్స్​కు వెళ్లే ప్రతీ క్రీడాకారుడి వెనుక ఏళ్ల శ్రమ, పోరాటం దాగున్నాయని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్ జాదవ్ ప్రతిభను మోదీ కొనియాడారు. జాదవ్ అత్యుత్తమ విలుకాడని.. అతని తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి జాదవ్ మొట్టమొదటిసారి టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనబోతున్నాడని ప్రశంసించారు.

భారత మహిళా హాకీ జట్టు సభ్యురాలైన నేహా గోయల్​తో పాటు ఆమె తల్లి, సహోదరులు కుటుంబ భారాన్ని మోసేందుకు సైకిల్ తయారీ సంస్థలో పనిచేస్తారని మోదీ తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక మహిళా ఆర్చర్ దీపికా కుమారి ప్రయాణం సైతం ఒడుదొడుకులతో కూడుకుని ఉన్నదేనని వివరించారు.

"టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనేవారు తమ కోసం మాత్రమే కాకుండా దేశం కోసం బరిలోకి దిగుతున్నారు. నేను కొందరి పేర్లు మాత్రమే ప్రస్తావించగలిగా. కానీ ఇంకా చాలా మంది ప్రతిభావంతులున్నారు."

-ప్రధాని మోదీ

ఇవీ చదవండి:

Last Updated :Jun 27, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details