తెలంగాణ

telangana

మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'

By

Published : Jan 5, 2021, 1:48 PM IST

'నేతాజీ అదృశ్యం'.. స్వతంత్ర భారతావనిలో ఇది ఓ మిస్టరీ. దశాబ్దాలు గడిచిపోయినా, ప్రభుత్వాలు మారిపోయినా.. ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. అయితే బంగాల్​ ఎన్నికలు దగ్గరపడిన ప్రతిసారి నేతాజీ పేరు వినిపిస్తోంది. ఇందుకు కారణమేంటి? బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. నేతాజీ రహస్య పత్రాలు బయటపెట్టాలని సోమవారం డిమాండ్​ చేయడం వెనుక అసలు కథేంటి?

Netaji Subhas
మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'

"నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన అన్ని ఫైళ్లను కేంద్రం బయటపెట్టాలని మేం డిమాండ్​ చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీకి మనం చేసిందేమీ లేదు అని నేను భావిస్తున్నాను. అందుకే ఆయన జయంతి అయిన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశాను. ఆయన జయంతిని 'దేశ్​ నాయక్​ దివస్​'గా బంగాల్​లో నిర్వహిస్తాం."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యంత్రి

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం చేసిన వ్యాఖ్యలివి. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఐదేళ్ల క్రితం... 2016 బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి.

"నేతాజీ.. ఓ గొప్ప పోరాట యోధుడు. ఆయన సాహసం, శౌర్యం, పరాక్రమం గురించి దేశం తెలుసుకోవాలి. ఆయన వివరాలు బహిర్గతం కావాలి. ఇన్నాళ్లూ కాంగ్రెస్​ దాచిపెట్టిన నేతాజీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తాం. ఆయనకు ఇదే అసలైన నివాళి."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవి 2015 అక్టోబర్​లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ప్రధాని మోదీ చెప్పిన మాటలు. అంతేకాదు ఆగమేఘాలపై అదే ఏడాది డిసెంబరు 4న నేతాజీకి సంబంధించిన 33 రహస్య ఫైళ్లను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. అనంతరం 2016 జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ.. ఆయనకు సంబంధించిన దాదాపు 100 రహస్య పత్రాలను బయటపెట్టారు. డిజిటల్‌ రూపంలో వాటిని దిల్లీలోని 'నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా' (ఎన్‌ఏఐ)లో ప్రదర్శించారు.

ఇలా బంగాల్​ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి 'నేతాజీ'ని తెరపైకి తీసుకురావడం.. తర్వాత నిశ్శబ్దంగా ఉండడం సహజమైపోయింది. ఎందుకంటే నేతాజీ.. ఏమయ్యారనే ప్రశ్న దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు 1000 వరకు ఉన్నాయన్నది చరిత్రకారుల మాట. అయితే ఇప్పటివరకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం బయటపెట్టిన ఫైళ్లు మొత్తం ఇందులో సగం కూడా లేవు.

ఆట మొదలుపెట్టింది దీదీనే!

నిజానికి... నేతాజీ మిస్టరీ విషయంలో ఏకంగా మోదీ రంగంలోకి దిగడం వెనుక ఓ కారణం ఉంది. బంగాల్​ సర్కార్ అధీనంలో ఉన్న నేతాజీ రహస్య ఫైళ్లను 2015 సెప్టెంబర్​లో మమతా బెనర్జీ బహిర్గతం చేశారు. ఈ చర్యను నేతాజీ కుటుంబసభ్యులు స్వాగతించారు.

"ఇదో చారిత్రక సందర్భం. నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేశాం. భరతమాత వీర పుత్రుడి గురించి తెలుసుకునే హక్కు దేశంలో ప్రతి ఒక్కరికీ ఉంది. మా పని మేం చేశాం! ఇక కేంద్రం కూడా స్పందించాలి"

- 2015లో మమతా బెనర్జీ

    ఇది బంగాల్​లో కమలనాథులకు షాక్​ ఇచ్చింది. అందుకే వెంటనే నేతాజీ రహస్య పత్రాల విడుదలపై కొద్ది రోజులకే మోదీ కీలక ప్రకటన చేశారు.

నేరుగా దీదీపై 'బోస్​ అస్త్రం'!

బంగాల్​లో పాగా వేయడం కమలనాథుల కల. అది నేరవేర్చుకోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ భాజపా వదులుకోదు. అందుకే నేతాజీ రహస్య ఫైళ్లను మమత బహిర్గతం చేయడం టీఎంసీకి కలివస్తుందని భావించి వెంటనే తేరుకొని వ్యూహాలు రచించింది. 2016 బంగాల్​ ఎన్నికల్లో ఏకంగా నేతాజీ మునిమనవడు చంద్రబోస్​ కుమార్​ను మమతా బెనర్జీపై భవానీపుర్​ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది భాజపా. ఆయనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కూడా ఇచ్చింది.

ఓటమి తర్వాత..

మమతపై ఓటమి తర్వాత చంద్రకుమార్​ బోస్ 2019 లోక్​సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అక్కడా ఓటమే ఎదురైంది. అయితే 2020లో కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణను బోస్​ వ్యతిరేకించారు. ఆ కొద్ది రోజులకే ఆయన్ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి భాజపా తప్పించింది.

మరోసారి తెరపైకి..

ఇప్పుడు మరోసారి బంగాల్​ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మమత.. వేగంగా పావులు కదుపుతున్నారు. 2016లో అసెంబ్లీ ఎన్నికల్లో తనపై భాజపా ప్రయోగించిన అదే 'బోస్' అస్త్రాన్ని తిరిగి ప్రయోగిస్తున్నారు. ఆనాడు ప్రధాని చెప్పిన అవే మాటల్ని తెరపైకి తెచ్చి మోదీని ఇరుకునపెడుతున్నారు దీదీ. నేతాజీ జయంతిని ఘనంగా నిర్వహించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాపై ఒత్తిడి తెచ్చేలా వ్యూహాల్ని రచ్చిస్తున్నారు. 2016 బంగాల్​ ఎన్నికల్లో మోదీకి పెద్దగా ఉపయోగపడని 'నేతాజీ' మంత్రం ఈసారి దీదీకి కలిసివస్తుందేమో వేచి చూడాలి!

ABOUT THE AUTHOR

...view details