తెలంగాణ

telangana

'పొలిటికల్​ ఎంట్రీ'పై పీకే స్పష్టత.. అక్టోబర్​ 2 నుంచి పాదయాత్ర

By

Published : May 5, 2022, 11:23 AM IST

Updated : May 5, 2022, 1:58 PM IST

Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొద్దిరోజుల కిందట సంకేతాలిచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ గురువారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పెట్టట్లేదని స్పష్టం చేశారు. బిహార్​లో సీఎం నితీశ్​ కుమార్​, లాలూ ప్రసాద్​ యాదవ్​తో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాభివృద్ధి కోరుకునేవారు తనతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్​ 2న పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు.

Political Stratagist prashant kishor
Political Stratagist prashant kishor

Prashant Kishor: బిహార్​ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడంపై అధికారిక ప్రకటన చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​. సీఎం నితీశ్​ కుమార్​, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ నేతృత్వంలో బిహార్​కు ఒరిగిందేమీ లేదని అన్నారు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలని పిలుపునిచ్చారు పీకే. అయితే.. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పెట్టట్లేదన్న ఆయన.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు తనతో కలిసి ముందుకురావాలని పట్నాలో విలేకరుల సమావేశంలో అన్నారు. ''ఒకవేళ తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ వేదిక కావాలని బిహార్‌ ప్రజలు కోరుకుంటే.. తప్పకుండా నేను దాని గురించి ఆలోచిస్తాను. అయితే, రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనందున ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచన లేదు.'' అని పీకే వెల్లడించారు.

''30 ఏళ్ల లాలూ, నితీశ్​ పాలన తర్వాత కూడా బిహార్.. దేశంలో అత్యంత వెనుకబడిన, పేద రాష్ట్రంగా ఉంది. అభివృద్ధిలో రాష్ట్రం ఇప్పటికీ అట్టడుగు స్థాయిలోనే ఉంది. రానున్న కాలంలో బిహార్ అగ్రగామి రాష్ట్రాల జాబితాలోకి రావాలంటే కొత్త ఆలోచనలు కావాలి. 90 శాతం మంది ప్రజలు బిహార్​లో మార్పు కోరుకుంటున్నారు. జన్​ సురాజ్​తో ప్రజలకు మరింత చేరువవుతా.''

- ప్రశాంత్​ కిశోర్​, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త

రాబోయే 3-4 నెలల్లో.. రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు వివరించారు పీకే. బిహార్​లో మంచి పరిపాలన(జన్​ సురాజ్​) కోసం.. వారి నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్​పైనా ప్రశాంత్​ కిశోర్​ మరోసారి కామెంట్స్​ చేశారు. కాంగ్రెస్​కు ప్రశాంత్​ కిశోర్​ అవసరం లేదని, పార్టీలో సమర్థులైన వ్యక్తులు ఎందరో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్​ ఏం చేయాలో వారికే తెలుసని, తనకు కాదని వ్యాఖ్యానించారు.

పీకే కాంగ్రెస్​లో చేరతారనుకున్న తరుణంలో.. ఆ పార్టీకి ఆయన పెద్ద ఝలక్​ ఇచ్చారు. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్​కు 'నాయకత్వం' అవసరమని పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల ఓ ట్వీట్​తో సంకేతాలిచ్చారు. ప్రజలకు చేరువ కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఆరంభం బిహార్​ నుంచే అని రెండు రోజుల కింద ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్​ 2024!!

'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్​కు పీకే ఝలక్​!

Last Updated : May 5, 2022, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details