తెలంగాణ

telangana

'మహాదేవ్‌ పేరునూ కాంగ్రెస్​ వదిలిపెట్టలేదు'- బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ప్రధాని మోదీ ధ్వజం

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 3:13 PM IST

Updated : Nov 4, 2023, 4:57 PM IST

PM Modi On Bhupesh Baghel Today : అవినీతి సొమ్ముతో తన ఖజానాను నింపుకోవడానికే కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​పై ఎదురుదాడి చేశారు.

PM Modi On Bhupesh Baghel Today
PM Modi On Bhupesh Baghel Today

PM Modi On Bhupesh Baghel Today : మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ బఘేల్‌పై ఎదురుదాడి చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నిందితులతో ఉన్న సంబంధం ఏమిటో బఘేల్ చెప్పాలని ప్రధాని డిమాండ్‌ చేశారు. దుర్గ్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రజలను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు చివరికీ దేవుళ్లను కూడా వదలడం లేదంటూ పరోక్షంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వ్యవహారాన్ని ప్రస్తావించారు.

"ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మిమ్మల్ని దోచుకునేందుకు ఏ ఒక్క అవకాశం వదలడం లేదు. వారు మహాదేవ్‌ పేరు కూడా వదిలిపెట్టడం లేదు. రెండు రోజులక్రితం రాయ్‌పుర్‌లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. ఈ డబ్బు జూదం ఆడేవారిది. వారు ఛత్తీస్‌గఢ్‌లోని పేదలను దోచుకోవటం ద్వారా ఈ డబ్బు కూడగట్టారు. ఈ డబ్బులతో కాంగ్రెస్‌ నేతలు తమ ఇళ్లను నింపుకుంటున్నారు. ఈ డబ్బుల లింక్‌ ఛత్తీస్‌గఢ్‌లోని వారి వద్దకు వెళ్తోంది. ఇక్కడి ముఖ్యమంత్రి ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు చెప్పాలి. దుబాయ్‌లో ఉన్న ఈ కుంభకోణం సూత్రధారులతో ఏం సంబంధమో చెప్పాలి."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Modi on Congress Chhattisgarh Today : తన దృష్టిలో దేశంలో అతిపెద్ద సామాజిక వర్గం అంటే పేదరికమే అని.. తాను వారికి సేవకుడినని ప్రధాని మోదీ చెప్పారు. పేదలను విభజించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని, కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు. ఓబీసీ ప్రధాన మంత్రిని, ఆ వర్గం మొత్తాన్ని కాంగ్రెస్‌ పార్టీ దూషిస్తోందని.. అయితే వీటికి తాను భయపడనని అన్నారు. పేదల అభివృద్ధిని కాంగ్రెస్‌ కోరుకోవడం లేదని దుయ్యబట్టారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తామని ప్రకటించారు.

మోదీకి దుబాయ్​తో సంబంధమేంటీ? ప్రధాని వ్యాఖ్యలపై బఘేల్ కౌంటర్​
మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​. తనకు దుబాయ్​తో ఉన్న సంబంధాలపై మోదీ ప్రశ్నలు అడిగారని.. అయితే, తాను కూడా మోదీని అదే ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. మహాదేవ్​ బెట్టింగ్ యాప్​ను ఎందుకు మూసివేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతని తెలిపారు. అంతకుముందు ఈడీ ఆరోపణలపై మీడియాతో మాట్లాడిన బఘేల్​.. ఇంతకంటే పెద్ద జోక్‌ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని పోటీ చేయాలని అనుకుంటోందని ఎద్దేవా చేశారు. తాము కూడా ఎవరో ఒకర్ని పట్టుకుని ఆ పట్టుకున్న వ్యక్తి ప్రధాని మోదీ పేరు చెప్తే.. ఆయనను విచారిస్తారా అని బఘేల్‌ ప్రశ్నించారు. ఒకరి ప్రతిష్టను నాశనం చేయడం చాలా సులభమని అన్నారు.

'అదానీకి భూములు ఇవ్వకుంటే బుల్లెట్​ దాడులు'
దేశంలో పేదరికాన్ని ఏకైక కులంగా భావించే ప్రధాని మోదీ... తనను తాను O.B.Cగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఆదివాసీలను "వనవాసీ" అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు వారిని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..."వనవాసి" అనే పదాన్ని తొలగిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగదల్‌పూర్‌లో బహిరంగసభలో రాహుల్ పాల్గొన్నారు. ఆదివాసీలు అంటే దేశానికి అసలైన యజమానులని పేర్కొన్నరాహుల్... బీజేపీ మాత్రం ఈ పదాన్నిఉపయోగించదని విమర్శించారు. ఆదివాసీలకు భూమి, నీరు అడవులు తిరిగి ఇవ్వవలసి వస్తుందనీ... ఆ పదాన్ని వాడటంలేదన్నారు. పారిశ్రామికవేత్త, తన మిత్రుడు అదానీకి భూములు ఇవ్వాలని ప్రధాని మోదీ అడుగుతారని.. ఇవ్వకపోతే బుల్లెట్ దాడులకు పాల్పడుతారని రాహుల్ ఆరోపించారు.

"ఐదేళ్లలో ఏ పారిశ్రామికవేత్త అయినా వ్యాపారం ప్రారంభించకుంటే ఆదివాసీలకు వారి భూములు తిరిగి ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నాం. అందుకు ఓ ఉదాహరణ చెబుతా. నరేంద్రమోదీ మిత్రుడు అదానీకి చెందిన ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ప్రాజెక్టు ఇక్కడ ఉండేది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని రద్దుచేసింది. మాకు ఈ ప్రాజెక్టు వద్దు అనే ఆదివాసీల మాటను గౌరవించాం. ఛత్తీస్‌గఢ్‌లోని భూమి, అడవి, జలం మీవి. ఆ హక్కు మీకు లభించాలి."

--రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

'గెలిచేది మేమే'.. ఎన్నికలపై ఖర్గే ధీమా
Mallikarjun Kharge on BJP : కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎన్ని దాడులు చేయించినా.. తమ కార్యకర్తలను నిరుత్సాహపరచలేరన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్​తో సహా ఛత్తీస్​గఢ్​లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో బీజేపీ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్ర నేత జైరాం రమేష్‌ మండిపడ్డారు. ఈడీ బఘేల్‌ గురించి అలా ప్రకటన విడుదల చేసిన వెంటనే బీజేపీ స్పందించడమే.. వాళ్లిద్దరూ కుమ్మక్కు అయ్యారనేందుకు నిదర్శనమన్నారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్‌పై ప్రజలకున్న నమ్మకాన్ని సన్నిగించలేవని... మళ్లీ అధికారం తమదేనని జైరాం రమేష్‌ అన్నారు.

'బఘేల్​కు రూ.508కోట్లు!'- 'కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారానికి బెట్టింగ్​ సొమ్ము, సీఎం జైలుకు వెళ్లడం పక్కా'

మహాదేవ్ బెట్టింగ్ యాప్​ కేసు- 'ప్రమోటర్ల నుంచి సీఎం బఘేల్​కు రూ.508కోట్ల చెల్లింపులు'

Last Updated :Nov 4, 2023, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details