తెలంగాణ

telangana

మరోసారి సుప్రీంకోర్టుకు 'పెగసస్'​ వ్యవహారం- పిటిషన్​ దాఖలు

By

Published : Jan 30, 2022, 10:40 AM IST

Pegasus Spyware Controversy: న్యూయార్క్​ టైమ్స్​ సంచలన కథనం వెలువరించిన క్రమంలో పెగసస్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది ఎంఎల్ శర్మ. ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

Pegasus
పెగసస్

Pegasus Spyware Controversy: పెగసస్ స్పైవేర్​ను భారత్​ 2017లోనే కొనుగోలు చేసినట్లు న్యూయార్క్​ టైమ్స్​ సంచలన కథనం వెలువరించిన క్రమంలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో పెగసస్ వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై దర్యాప్తునకు పిటిషనర్ ఎంఎల్ శర్మ డిమాండ్ చేశారు. ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యూయార్క్ టైమ్స్ నివేదికను పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే.. పెగసస్​ స్పైవేర్​ వ్యవహారంపై సుప్రీం కోర్టు కమిటీ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. కమిటీ నివేదిక రావాల్సి ఉందని స్పష్టం చేశాయి. పెగసస్​తో తమ ఫోన్​లు ప్రభావితమయ్యాయని భావించిన వారు.. తమ చరవాణులను అప్పగించాలని జనవరి 2న రిటైర్డ్​ జడ్జీ జస్టిస్​ ఆర్​వీ రవీంద్రన్​ నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ.. పత్రికా ప్రకటన చేసినట్లు గుర్తు చేశాయి.

వివాదం ఏమిటి?

యావత్​ దేశాన్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగసస్‌కు కూడా డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. పెగసస్‌ తయారీ సంస్థ ఎస్‌ఎస్‌ఓతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది.

విపక్షాలు ధ్వజం..

  • న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ.. అధికార భాజపాపై తీవ్రంగా మండిపడింది. మోదీ సర్కారు భారతదేశానికి శత్రువులా ఎందుకు ప్రవర్తిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
  • 'ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్‌ ట్యాపింగ్‌ దాడికి గురయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది' అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
  • 'ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయానికి ఉంది. రూ.300 కోట్ల ప్రజల డబ్బు చెల్లించి, దీనిని కొనుగోలు చేశారని న్యూయార్క్‌ టైమ్స్ కథనం వెల్లడించింది. పెగాసస్‌ అంశంపై సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ను కేంద్రం తప్పుదోవ పట్టించిందని తాజా పరిణామం సూచిస్తోంది.' అని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శక్తి సిన్హ్‌ గోహిల్‌
  • స్పైవేర్‌ను రక్షణ పరంగా కాకుండా.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారని ఆరోపించారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. భాజపాతోనే అది సాధ్యం. వారు దేశాన్ని బిగ్‌ బాస్‌ షోగా మార్చారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'పెగసస్​పై సుప్రీం కమిటీ దర్యాప్తు చేస్తోంది.. నివేదిక రావాలి'

ABOUT THE AUTHOR

...view details