తెలంగాణ

telangana

'నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను'.. జిల్లా కలెక్టర్​

By

Published : Mar 29, 2023, 1:57 PM IST

ఓ మహిళా కలెక్టర్​ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. చిన్నతనంలో ఇద్దరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని చెప్పారు. తనతో అలా ప్రవర్తించిన వ్యక్తులు ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నట్లు వెల్లడించారు. ఆ కలెక్టర్ ఎవరంటే?

pathanamthitta collector divya s iyer
పతనంతిట్ట జిల్లా కలెక్టర్​ డాక్టర్​ దివ్య ఎస్​ అయ్యర్​

కేరళకు చెందిన ఓ ఐఏఎస్​ అధికారికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆరేళ్ల వయసున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో చిన్నతనంలోనే మానసిక క్షోభకు గురైనట్లు ఆమె తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన మెంటల్​ సపోర్ట్​ కారణంగా తాను ఆ బాధ నుంచి బయటపడినట్లు చెప్పారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలోనే గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్​ మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయాలని కోరారు.

పతనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్​​ దివ్య ఎస్.​ అయ్యర్​ తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించారు. దివ్య అయ్యర్​ ఒకటో తరగతి చదువుతున్నప్పుడు తనను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించినట్లు తెలిపారు. పిల్లలు ఎదిగే వయస్సులోనే వారికి మంచేదో చెడోదో తెలియజేయాలని కోరుతూ.. తన అనుభవాన్ని వివరించారు.

"ఇద్దరు వ్యక్తులు నన్ను ఆప్యాయంగా పిలిచారు. నేను వాళ్ల వద్దకు వెళ్లాను. వాళ్లు ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు నా బట్టలు విప్పినప్పుడు బాధగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాను. మా తల్లిదండ్రులు ఇచ్చిన మెంటల్ సపోర్ట్ కారణంగా నేను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగాను. ఆ తర్వాత వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశాను. కానీ, వారు నాకు కనిపించలేదు. ఆ ఘటన తర్వాత నేను వారిని చూడలేదు. కానీ వారి ముఖాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆరేళ్ల వయస్సులో జరగడం వల్ల నేను దాన్ని తప్పు అని గుర్తించలేకపోయాను." అని ఆమె తన చేదు జ్ఞాపకం గురించి అందరికీ తెలియజేశారు.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఐఏఎస్​ డాక్టర్ దివ్య ఎస్​ అయ్యర్​

చిన్నవయస్సులోనే మంచి స్పర్శ, చెడు స్పర్శ(గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్​)లను గుర్తించేలా పిల్లలకు నేర్పించాలి అని సూచించారు దివ్య అయ్యర్. సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా పెరగాల్సిన వయసులో చిన్నారులు మానసిక క్షోభకు గురికాకుండా అందరూ జాగ్రత్తపడాలని హితవు పలికారు. పిల్లలకు ఎదురయ్యే హింసపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పాలని కలెక్టర్‌ దివ్య అయ్యర్​ అన్నారు.

వార్తలు అందించేటప్పుడు గమనించాల్సిన విషయాల గురించి మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కేరళ ప్రభుత్వం యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఓ సమావేశం​ నిర్వహించింది. ఈ సమావేశం​లో పాల్గొన్న పతనంతిట్ట జిల్లా కలెక్టర్​ల దివ్య ఎస్​ అయ్యర్ తన అనుభవాన్ని వెల్లడించారు. డాక్టర్​ విద్యనభ్యసించిన ఈమె మాజీ ఎమ్మెల్యే, కాగ్రెస్​ నేత కేఎస్​ శబరినాథ్​ను పెళ్లి చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details