తెలంగాణ

telangana

'స్థాయీ సంఘాల వర్చువల్ భేటీలు కుదరవు'

By

Published : May 15, 2021, 7:29 AM IST

వర్చువల్‌ విధానంలో పార్లమెంటు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని రాజ్యసభ స్పష్టం చేసింది. ఇలా చేయాలంటే కొన్ని నిబంధనలను సడలించాల్సి ఉంటుందని పేర్కొంది. పార్లమెంట్​ సమావేశాలు లేకపోవడం వల్ల సవరణలు చేయడం కుదరదని వివరించింది.

Rajya Sabha
'వర్చువల్‌ సమావేశాలు సాధ్యం కాదు'

పార్లమెంటు స్థాయీ సంఘాల సమావేశాలు వర్చువల్‌ విధానంలో నిర్వహించడం ప్రస్తుతం సాధ్యం కాదని రాజ్యసభ సచివాలయం తెలిపింది. ఈ తరహా సమావేశాలు జరపాలంటే నిబంధనలను సడలించాల్సి ఉంటుందని పేర్కొంది. పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం లేకపోవడం వల్ల నిబంధనల సవరణ వీలు కాదని తెలిపింది.

సమావేశాలు రహస్యంగా జరగాలన్న నిబంధన ఉన్నందున దానిని తగిన విధంగా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎగువసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మౌనంగా ఉండలేమని, అందువల్ల వర్చువల్‌ విధానంలో స్థాయీ సంఘాల సమావేశాలు జరపాలని కోరుతూ ఖర్గే ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

ఇందుకు రాజ్యసభ సచివాలయం సమాధానం ఇచ్చింది. వర్చువల్‌ విధానంలో భేటీలు జరపడంపై ఇంతకుముందే లోక్‌సభ, రాజ్యసభల అధిపతులు చర్చలు జరిపారని తెలిపింది. దీన్ని రూల్స్‌ కమిటీకి పంపాలని కూడా భావించారని తెలిపింది. అయితే తగిన జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక రూపంలోనే తరచూ సమావేశాలు జరుగుతున్నందున వర్చువల్‌ భేటీలు అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని పేర్కొంది.

ఇదీ చూడండి:'మృతుల గౌరవం కాపాడేందుకు కొత్త చట్టం!'

ABOUT THE AUTHOR

...view details