తెలంగాణ

telangana

'బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు'.. ప్రమాదస్థలిని సందర్శించిన మోదీ.. క్షతగాత్రులకు పరామర్శ

By

Published : Jun 3, 2023, 4:01 PM IST

Updated : Jun 3, 2023, 6:49 PM IST

Odisha Train Accident Modi : ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైలు ప్రమాద ఘటనాస్థలిని సందర్శించిన మోదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Odisha Train Accident Modi
Odisha Train Accident Modi

రైలు ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ

Odisha Train Accident Modi : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం మధ్యాహ్నం సందర్శించారు. అక్కడ పరిస్థితిని, సహాయక చర్యలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్​, ధర్మేంద్ర ప్రధాన్​తో కలిసి మోదీ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైలు ప్రమాద ఘటన గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
రైలు ప్రమాద ఘటనాస్థలిలో ప్రధాని
ఘటనాస్థలిలో ప్రధాని మోదీ

ఒడిశా కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రిలో ప్రధాని మోదీ మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని వారిని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అధికారులు చేపట్టిన పునురుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ.. బాలేశ్వర్​లో క్షతగాత్రుల చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించారు. క్షతగాత్రుల బాగోగులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రధాని మోదీ.. రైలు ప్రమాద ఘటనాస్థలికి సందర్శించేందుకు ఇండియన్ ఎయిర్​ఫోర్స్ హెలికాప్టర్​లో శనివారం మధ్యాహ్నం బాలేశ్వర్​కు చేరుకున్నారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం ఏ అవకాశాన్నీ వదిలిపెట్టదని ప్రధాని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన సంఘటన అని.. దీనిపై అన్ని కోణాల్లో విచారణకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే సిబ్బంది కృషి చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. క్షతగాత్రులను కలిసి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించినట్లు ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు.

"రైలు ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తాం. ఒడిశా ప్రభుత్వం రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించింది. ఒడిశా సర్కారుకు అన్ని విధాలా అండగా ఉంటాం. సహాయ చర్యల్లో పాల్గొన్న స్థానికులందరికీ ధన్యవాదాలు. చాలామంది యువకులు రక్తదానానికి ముందుకొచ్చారు. వ్యవస్థలను మరింత సురక్షితం చేయాల్సిన అవసరం ఉంది. రైలు ప్రమాద ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తునకు ఆదేశించాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం"

--నరేంద్ర మోదీ, దేశ ప్రధాని

Odisha Train Accident Reason : సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టిందని తెలిపింది. మెయిన్‌ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇచ్చారని.. అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్​లైన్​లోకి వెళ్లిందని వెల్లడించింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపింది.

Last Updated : Jun 3, 2023, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details