తెలంగాణ

telangana

ఒడిశా పట్టాలపై నలిగిపోయిన 'ప్రేమ' గీతాలు!.. ఆ చిన్నారులకు అదానీ, సెహ్వాగ్ ఉచిత విద్య

By

Published : Jun 4, 2023, 10:28 PM IST

Updated : Jun 4, 2023, 10:58 PM IST

Odisha Train Accident : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ క్రమంలోనే కోరమాండల్‌ రైలులోని బోగీలో ఓ బంగాలీ ప్రయాణికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ డైరీలో రాసుకున్న 'ప్రేమ గీతాలు'.. రైలు పట్టాలపై చెల్లాచెదురై కనిపించాయి. మరోవైపు, ప్రమాద ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, మాజీ స్టార్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు ముందుకొచ్చారు.

Odisha Train Accident
Odisha Train Accident

Odisha Train Accident Love Letter : ఒడిశాలోని బాలేశ్వర్​లో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. కొన్ని వందల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అయితే కోరమాండల్‌ బోగీలో ఓ బంగాలీ ప్రయాణికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ డైరీలో రాసుకున్న 'ప్రేమ గీతాలు'.. ఇప్పుడు నెత్తుటి పట్టాలపై చెల్లాచెదురయ్యాయి. "చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి" అని బంగాలీలో చేతిరాతతో రాసి ఉంది.

"అన్నివేళలా నీ ప్రేమ కావాలి. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు" అని రాసి ఉన్న కాగితాలు చెల్లాచెదురైన ట్రాకులపై పడిపోయాయి. ఘటనాస్థలిలో బాధిత ప్రయాణికుల వస్తువులను వెలికి తీస్తున్న సహాయసిబ్బంది కంటపడ్డాయి. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ డైరీ ఎవరిది? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయంపై మాత్రం తెలియరాలేదు.

ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్‌ల చొరవ!
Train Accident Odisha : ఈ ఘోర ప్రమాదంలో ఎంతోమంది తమ ఇంటి సభ్యులను, ఆత్మీయులను కోల్పోవడం వల్ల వారి వేదన వర్ణనాతీతంగా మారింది. చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు బిలీయనీర్‌, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, భారత క్రికెట్‌ మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందుకొచ్చారు. ఈ ఘటనతో అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.

"ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలుసుకుని మేమంతా తీవ్ర మనోవేదనకు గురయ్యాం. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతలను తీసుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. పిల్లల భవిష్యత్తుతోపాటు బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత" అని అదానీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. " ఈ విషాద ఘటనతో అనాథలుగా మిగిలిన పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తా. వారికి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్య అందిస్తా" అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి, స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చిన వారికి, వైద్య బృందాలకు సెల్యూట్‌ చెప్పారు.

టికెట్‌ లేని వారికీ పరిహారం!
రైలు ప్రమాద బాధితుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వారికి సైతం పరిహారం అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటిని అందజేస్తామని తెలిపింది. రైల్వే మంత్రి ప్రకటించినట్లుగా.. చనిపోయిన బాధిత కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.50వేల చొప్పున పరిహారం సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. టికెట్‌ ఉందా? లేదా? అనేది అంశంతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్క బాధితుడికీ పరిహారం అందుతుందని రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ వెల్లడించారు.

సీబీఐతో దర్యాప్తు!
Odisha Train Accident CBI : ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు సీబీఐతో దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. 'ఘటనాస్థలిలో సహాయ చర్యలు పూర్తయ్యాయి. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా.. ఓవర్‌హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది' అని మంత్రి వివరించారు.

Odisha Train Accident Reason : అంతకుముందు, ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్‌ తప్పిదమో.. వ్యవస్థలోని లోపాలో కారణం కాదని అశ్వనీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించటం, ఎలక్ట్రానిక్స్‌ ఇంటర్ లాకింగ్‌ వ్యవస్థను టాంపరింగ్‌ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఘోర రైలు ప్రమాదానికి కారణాలను, బాధ్యులను గుర్తించినట్లు రైల్వేమంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌, పాయింట్‌ మెషిన్‌లో మార్పుల వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

Last Updated : Jun 4, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details