తెలంగాణ

telangana

ఆరో రోజూ ఐటీ సోదాలు, అసలు లెక్క రూ.350 కోట్లకుపైనే- 'రాహుల్​, సోనియా మౌనం వీడాలి'

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 2:23 PM IST

Odisha Black Money Case : ఒడిశాలో మద్యం కంపెనీల పన్ను ఎగవేత ఆరోపణలపై ఆరో రోజూ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.353 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. ఒడిశా వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Black Money In Odisha
Odisha IT Raids

Odisha Black Money Case :ఒడిశాలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లెక్కల్లోకి రాని రూ.353 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే ఘటనలో ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారని వెల్లడించారు. ఐదు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగగా, 176 డబ్బు సంచులను బాలంగిర్ ఎస్​బీఐ బ్రాంచీలో డిపాజిట్ చేసినట్లు చెప్పారు.

Black Money In Odisha :ఒడిశా రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధమున్న పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ నగదు కౌంటింగ్​ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. ఈ కౌంటింగ్​ ప్రక్రియలో ముగ్గురు బ్యాంక్ అధికారులు, 50 మంది ఐటీ శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు. 40 కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఇందుకోసం వినియోగించారు. తితిలాగఢ్‌, సంబల్‌పుర్‌లోని దేశీ మద్యం తయారీ యూనిట్ల నుంచి కూడా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ డబ్బును రెండు వ్యాన్లలో సంబల్‌పుర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తరలించారు.

అల్మారాల్లో గుట్టలుగా పేర్చిన నోట్ల కట్టలు

60 కిలోల బంగారం స్వాధీనం!
గత బుధవారం ఈ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ఒడిశాలోని పలువురు మద్యం యజమానులకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు 60 కిలోల బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఐటీ సోదాల్లో బయటపడ్డ భారీ నగదు

ఎంపీ కంపెనీతో వారి సంబంధాలు!
బౌధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిశా డిస్టిలరీ కంపెనీతో పాటు ఇతర లిక్కర్​ కంపెనీలతో ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన బల్దేవ్ సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్​ కంపెనీకి చెందిన వ్యాపార సముదాయాల్లోనూ ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బాలంగీర్​, సంబల్​పుర్​, సుందర్​ఘడ్​, భువనేశ్వర్​తో పాటు కోలకతా, ఝార్ఖండ్​లోని బొకారో నగరాల్లో కూడా సోదాలు జరిగాయి. అంతేకాకుండా సాహుకు చెందిన ఆస్తులపైనా ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

బీజేపీ ఫైర్​!
కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన స్థలాల్లో నోట్ల కట్టలు దొరకడంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్​ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించి ఐటీ దాడుల కేసుపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడట్లేదని నడ్డా ప్రశ్నించారు. ఈ విషయంలో వారు మౌనం వీడాలని ఆయన డిమాండ్​ చేశారు.

"కాంగ్రెస్​ పార్టీ అవినీతి ఒకే నాణేనికి రెండు ముఖాలు వంటివి. రాహుల్​ గాంధీ, ధీరజ్​ సాహు నేతృత్వంలో సాగుతున్న ఈ లిక్కర్​ దందాలో పట్టుబడ్డ ఈ నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చెందుతుంది అనే సమాధానాలు చెప్పాలి."
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయాధ్యక్షుడు

ఇండియా కూటమి మౌనం అందుకే: అమిత్ షా​
'ఒక ఎంపీ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అవినీతిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ నోరు ఎందుకు విప్పడం లేదు. ప్రధాని మోదీ కేంద్ర ఏజెన్సీలైన ఐటీ, ఈడీ వంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వారి అవినీతి బయటపడుతుంది కాబట్టి' అని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మండిపడ్డారు.
ఇక ఇదే వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్​. ఈ విషయంతో కాంగ్రెస్​ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. దీనిపై పూర్తి వివరణ ధీరజ్ సాహునే ఇవ్వగలరని ఆయన నొక్కి చెప్పారు.

అల్మారాల్లో నోట్ల గుట్టలు- రూ.220కోట్లు సీజ్​- ప్రతి పైసా కక్కిస్తామన్న మోదీ

లిక్కర్ కంపెనీల్లో నోట్ల గుట్టలు- రూ.300 కోట్లు సీజ్- లెక్కించలేక మొరాయించిన క్యాష్ మెషిన్లు!

ABOUT THE AUTHOR

...view details