తెలంగాణ

telangana

భాజపా నేతపై దాడి.. ఎమ్మెల్యే సస్పెండ్

By

Published : Sep 9, 2021, 9:18 AM IST

భాజపా నేతపై చేయి చేసుకున్న ఓ ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఘటన ఒడిశాలో జరిగింది. ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్న ఓ భాజపా నేతను ప్రజల సమక్షంలోనే కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై అధిష్ఠానం వేటు వేసింది.

mla suspended
mla suspended

భాజపా నేతను కొట్టారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న బిజూ జనతా దళ్(బీజేడీ) ఎమ్మెల్యే ప్రశాంత కుమార్ జగదేవ్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆయన ఒడిశాలోని చిలికా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బలుగావ్ నగర్ భాజపా అధ్యక్షుడు నిరంజన్ సేథీని జగదేవ్ కొట్టారని ఆరోపణలొచ్చాయి.

ఇదీ జరిగింది..

వృద్ధాప్య పెన్షన్, ఇతర బకాయిల చెల్లింపుల్లో ఆలస్యంపై ఆరా తీయడానికి స్థానిక నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఏసీ) కార్యాలయానికి వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనితో కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యేపై సస్పెన్షన్​ వేటు పడింది.

ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం జారీ చేసిన ఉత్తర్వులు

"ఎన్‌ఏసీ కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా జగదేవ్ దాడి చేశారు. గాయాలపాలైన నన్ను నా మద్దతుదారులు రక్షించారు. పలు పథకాలపై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించగా కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే అందరి ముందే నన్ను కొట్టారు."

-నిరంజన్ సేథి, భాజపా నేత

ఈ ఘటనపై ఒడిశాలో రాజకీయ దుమారం చెలరేగింది. బీజేడీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ బలుగావ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.

ఎమ్మెల్యే ప్రశాంత కుమార్ జగదేవ్

ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 'ప్రశాంత్ కుమార్ జగదేవ్ సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తుందని' అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అంతేగాక ఖోర్ధా జిల్లా ప్రణాళికా సంఘం ఛైర్మన్ పదవి నుంచి జగదేవ్‌ను తొలగిస్తూ పట్నాయక్ ఉత్తర్వులు జారీచేశారు.

2016 లోనూ బౌద్ జిల్లా పర్యటనలో మంత్రులకు నల్ల జెండాలు చూపిన కొందరు భాజపా మద్దతుదారులను జగ్​దేవ్​ కొట్టారనే ఆరోపణలున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details