తెలంగాణ

telangana

60 ఏళ్లలో 30 వేల మొక్కలు నాటిన 'వృక్ష గురువు'!

By

Published : Jul 30, 2021, 3:09 PM IST

టు లివ్ అండ్ లెట్ లివ్​(బతుకు బతకనివ్వు).. అని ఏ జంతువుకు, పక్షికి ఎవరూ చెప్పలేదు. మనకు అరిచి చెప్పినా అర్థం కాదు. చెట్లను నరికితే అంతరించేది మానవాళి కూడా అని గ్రహించం. అభివృద్ధి పేరిట అగాథంలోకి పయనిస్తాం. అలాంటి ధోరణితో జరిగే నష్టాన్ని.. 60 ఏళ్లుగా చేతనైంత పూడ్చుకుంటూ వస్తున్నారు అంతర్జ్యామి సాహో. మొక్కలు నాటడానికే జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అదే తాను ప్రకృతికి చేసే సేవగా భావిస్తున్నారు.

Trees
వృక్షాలు

60 ఏళ్లలో 30 వేల మొక్కలు నాటిన అంతర్జ్యామి సాహో

మనిషి సహా భూమి మీద అన్ని జీవాల మనుగడకు వృక్షాలు ఎంత అవసరమో తెలియనిది కాదు. అభివృద్ధి పేరుతో వాటిని నరికేస్తున్నారని తిట్టుకోవడం, మర్చిపోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఏనాడు మొక్కలు నాటడానికి చొరవ తీసుకోం. ఇక చెట్లను నాటాలంటూనే ప్రాజెక్టుల కోసం లక్షల సంఖ్యలో వృక్షాలను కర్కశంగా కూకటివేళ్లతో పెకిలించి వేస్తున్నాం. అన్నీ తెలిసి ఏమీ పట్టనట్టు ఉండే కోట్లాది మందిలో.. అంతర్జ్యామి సాహో లాంటి ఆణిముత్యాలుండటం వల్లే పుడమి తల్లి కాస్తయినా పచ్చగా విరాజిల్లుతోంది.

అంతర్జ్యామి సాహో

ఎవరీ సాహో..

72 ఏళ్ల అంతర్జ్యామి సాహో.. 10 ఏళ్ల వయసులోనే మొక్కలపై మక్కువ పెంచుకున్నారు. అప్పటి నుంచి 60 ఏళ్లుగా చెట్లకు ప్రాణం పోస్తున్నారు. ఇప్పటి వరకు 30 వేల మొక్కలు నాటి నిశబ్ధంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సిసలైన మనిషి సాహో.

మొక్కలు నాటుతున్న సాహో

వృక్ష గురువు..

ఒడిశాలోని నయాగఢ్​ జిల్లా కింటిలో గ్రామానికి చెందిన ఈ అంతర్జ్యామి సాహో.. స్థానికంగా వృక్ష గురువుగా పేరుగాంచారు. 6 దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఆరో తరగతిలో మర్రిచెట్టు విత్తు నాటి మొదలు పెట్టిన తన ప్రస్థానాన్ని ఉపాధ్యాయునిగా రిటైరయ్యాక కూడా అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.

వృక్షాల ప్రాముఖ్యతను తెలిపేలా చిత్రాలు

"1961 నుంచి ఎవరి సహాయం లేకుండా కొండలు, రోడ్డు పక్కన, పోడు భూముల్లో చెట్లు నాటుతున్నా. నా సేవ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది."

-సాహో

ప్రతి పాఠశాలకు తిరుగుతూ విద్యార్థులకు ప్రకృతి పాఠాలు నేర్పుతుంటారు సాహో. వృక్షాల ఆవశ్యకత, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఎక్కడ ఏ మొక్కను నాటాలి లాంటి విషయాలను గ్రామస్థులకూ వివరిస్తుంటారాయన.

చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై పాఠాలు
ఊరూరా అవగాహన కల్పిస్తూ

ఏ పనీ ఒక్కరితో సాధ్యం కాదని, అందుకే చెట్లు నాటే దిశగా అవగాహన కల్పిస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తున్నట్లు సాహో తెలిపారు. ఎవరు ఎక్కడ ఇలాంటి కార్యక్రమం చేపట్టినా అందులో పాల్గొంటారు.

వన్యప్రాణులూ ముఖ్యమే..

వన్యప్రాణుల సంరక్షణ కోసమూ తపిస్తారు సాహో. అవి మాత్రమే తాము బతుకుతూ ప్రకృతిని సుసంపన్నం చేస్తాయని.. కానీ మనుషులు పూర్తి వినాశనానికి పాల్పడుతున్నారని అంటారాయన.

మొక్కలు నాటాలని పిలుపునిస్తూ

"మనం చెట్లు నాటుతాం కానీ వన్యప్రాణులను విస్మరిస్తున్నాం. ఏ వృక్షాలైతే వాటికి ఆహారం, వసతి కల్పిస్తాయో వాటిని మనం నాటడం లేదు. ప్రభుత్వం కూడా ఆ తరహా మొక్కలను అందించడం లేదు."

-సాహో

ఇక నయాగఢ్​ అటవీ ప్రాంతంలో సాహో ఇచ్చిన ఎన్నో సలహాలను అమలు చేసినట్లు ప్రాంతీయ అటవీ అధికారి హెచ్​డీ ధన్​రాజ్​ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఈ వృక్ష గురువు సేవలను గుర్తించి, ట్విట్టర్​ వేదికగా ప్రశంసించారు.

సాహో గుర్తింపు

ఇదీ చూడండి:300 ఏళ్ల నాటి ఈ భారీ వృక్షం గురించి తెలుసా?

ABOUT THE AUTHOR

...view details