తెలంగాణ

telangana

ప్రతిపక్షాలు లేని అసెంబ్లీ.. ఆ స్టేట్​లో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వంలో భాగమే!

By

Published : Mar 6, 2023, 12:21 PM IST

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అధికార పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైనప్పుడు ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషిస్తాయి. కానీ, ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. నాగాలాండ్‌లో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గత నెలలో అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్​డీపీపీ- బీజేపీ కూటమికే అన్ని పార్టీలు మద్దతివ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.

NAGALAND ASSEMBLY OPPOSITION
NAGALAND ASSEMBLY OPPOSITION

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నప్పుడు... సమస్యల పరిష్కారంలో విఫలమైనప్పుడు... ప్రతిపక్షం.. ప్రజా గొంతుకుగా మారుతుంది. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, అత్యధిక రాజకీయ పార్టీలు ఉన్న నాగాలాండ్‌లో అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. నాగాలాండ్‌లో గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ కూటమికే అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం వల్ల అసలు నాగాలాండ్‌లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎలాంటి షరతులు లేకుండా ఎన్​డీపీపీ- బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి.

60మంది సభ్యులున్న నాగాలాండ్‌ శాసనసభకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ముందే జట్టుకట్టిన అధికార ఎన్​డీపీపీ 25, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఈ కూటమి 37 మంది ఎమ్మెల్యేలతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుకునే బలం సంపాదించింది. ఇక 7 స్థానాలు గెలిచిన ఎన్సీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్​పీపీ 5, ఎల్​జేపీ 2, ఎన్​పీఎఫ్, ఆర్​పీఐ 2 జేడీయూ ఒక స్థానం గెలుచుకున్నాయి. నలుగురు ఇండిపెండెంట్లు సైతం విజయం సాధించారు. నాగాలాండ్‌ శాసనసభ ఎన్నికల్లో ఇన్ని పార్టీలకు ఒక్క స్థానమైనా రావడం ఇదే తొలిసారి కాగా... ఈ పార్టీలన్నీ ఎన్​డీపీపీ- బీజేపీ కూటమికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే ఎల్​జేపీ, ఆర్​పీఐ, జేడీయూ పార్టీలు ఎన్​డీపీపీ- బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడో అతి పెద్ద పార్టీ అయిన ఎన్​సీపీ... ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తున్నట్లు లేఖను సమర్పించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే మొంబెమో తెలిపారు. ఎన్​డీపీపీ- బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో అధికారిక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం ఉందని ఎన్​పీఎఫ్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నాగాలాండ్‌లో 2015, 2021లో ప్రతిపక్షాలు లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రతిపక్షాలు లేని శాసనసభ ఏర్పాటు కానుండడం మాత్రం నాగాలాండ్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

మూడు రాష్ట్రాల్లో బీజేపీ హవా!
ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా.. త్రిపురలో సొంతంగా మెజార్టీ సాధించింది. 60 స్థానాలు ఉన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 32 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు, మేఘాలయలో రెండు స్థానాల్లో విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details