తెలంగాణ

telangana

Corona Reinfection: 26 ఏళ్ల డాక్టర్​కు 13 నెలల్లో 3 సార్లు కరోనా

By

Published : Jul 28, 2021, 7:02 AM IST

ముంబయికి చెందిన ఓ వైద్యురాలు.. 13 నెలల్లో ఏకంగా మూడుసార్లు కరోనా(Corona Reinfection) బారిన పడ్డారు. టీకా తీసుకున్నాక కూడా తనకు రెండు సార్లు మహమ్మారి సోకిందని వైద్యురాలు తెలిపారు. టీకా రెండు డోసులు తీసుకున్నా.. బ్రేక్‌ థ్రో ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉందని వాక్‌హార్డ్ ఆస్పత్రికి చెందిన వైద్యులు బెహ్రామ్ పార్దివాలా వెల్లడించారు.

Corona
కరోనా వైరస్

కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దాంతో రీ ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలు 13 నెలల వ్యవధిలో మూడుసార్లు కొవిడ్(Corona Reinfection) బారినపడ్డారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలే వెల్లడించారు.

డాక్టర్ సృష్టి హళ్లారి ముంబయిలోని వీర్ సావర్కర్ ఆస్పత్రిలో కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గతేడాది జూన్ 17న మొదటిసారి వైరస్‌ బారినపడ్డారు. ఆ సమయంలో ఆమెలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఆమెతో సహా కుటుంబం అంతా రెండు డోసుల టీకా తీసుకున్నారు. సరిగ్గా నెలరోజులకు మే 29న ఈ వైద్యురాలు రెండోసారి(Corona Reinfection) వైరస్ బారినపడ్డారు. అప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. ఇక మూడోసారి జులై 11న ఆమెకు మళ్లీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈసారి ఆమెతో పాటు కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని సృష్టి వెల్లడించారు.

తీవ్రంగా ఇబ్బంది..

'నేను మూడోసారి కరోనా(Corona Reinfection) బారినపడ్డాను. ఈసారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నాతో సహా కుటుంబమంతా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. మాకు రెమ్‌డెసివిర్ వాడాల్సిన పరిస్థితి ఎదురైంది. మా అమ్మ, సోదరుడికి మధుమేహం ఉంది. మా నాన్నకు బీపీ, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. నా సోదరుడికి శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో రెండురోజుల పాటు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది' అని ఆమె తెలిపారు.

బ్రేక్‌ థ్రో ఇన్ఫెక్షన్

ఇదిలా ఉండగా.. కొవిడ్ టీకా వేయించుకున్నా వైరస్ సోకుతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ముందునుంచి వైద్య నిపుణులు వెల్లడిస్తూనే ఉన్నారు. 'టీకా రెండు డోసుల తర్వాత వైరస్ బారినపడినవారున్నారు. అన్ని వయస్సులవారికి బ్రేక్‌ థ్రో ఇన్ఫెక్షన్( టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకడం)వచ్చే ఆస్కారం ఉంది.

అయితే టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి' అని వాక్‌హార్డ్ ఆస్పత్రికి చెందిన వైద్యులు బెహ్రామ్ పార్దివాలా వెల్లడించారు. ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:Black Fungus: పెద్ద పేగుకు సోకిన బ్లాక్​ ఫంగస్ ​

ABOUT THE AUTHOR

...view details