తెలంగాణ

telangana

90 ఏళ్ల బామ్మ కారు డ్రైవింగ్​.. వీడియో వైరల్​!

By

Published : Sep 25, 2021, 2:35 PM IST

Updated : Sep 25, 2021, 5:52 PM IST

90 ఏళ్ల వయసులో కూడా ఓ బామ్మ కారు డ్రైవింగ్​ నేర్చుకుని అనుభవజ్ఞులు నడిపినట్టు నడుపుతోంది. కేవలం మూడు నెలల్లోనే కారు డ్రైవింగ్​ నేర్చుకోవడం విశేషం. బామ్మ కారు డ్రైవింగ్​ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్.. ట్విట్టర్​ వేదికగా ఆమెను అభినందించారు.

90 women driving
90 ఏళ్ల బామ్మ కారు డ్రైవింగ్​.. వీడియో వైరల్​!

90 ఏళ్ల బామ్మ కారు డ్రైవింగ్​.. వీడియో వైరల్​!

ఐదు పదుల వయసు దాటే సరికే జీవితం అయిపోయింది అంటూ డీలా పడిపోతుంటారు చాలా మంది. శరీర పటుత్వం కోల్పోయినా పట్టుదలతో అనుకున్న పనిని సాధించే వారిని చాలా అరుదుగా చూస్తాం. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బామ్మ వృద్ధాప్యంలోనూ ఇంకా ఒంట్లో సత్తా ఉందని నిరూపించింది. 90 ఏళ్ల వయసులో తనకు ఇష్టమని కారు డ్రైవింగ్‌ నేర్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. బామ్మ కారు డ్రైవింగ్​ విషయం ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ వరకు చేరింది. ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా బామ్మను అభినందించారు.

మధ్యప్రదేశ్​లోని దేవాస్​ జిల్లా బిలావాలీకి చెందిన 90 ఏళ్ల రేషమ్​ బాయ్​కు డ్రైవింగ్​ అంటే ఆసక్తి. ఇంట్లో అందరికీ డ్రైవింగ్​ రావడం, తన మనవళ్లు, మనవరాళ్లు కూడా డ్రైవింగ్​ నేర్చుకునే సరికి ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఇదే విషయాన్ని తన కుమారుల వద్ద ప్రస్తావించగా వయసును దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్​కు దూరంగా ఉండాలన్నారు. అయినా పట్టువదలని బామ్మ.. తన చిన్న కుమారుడి సాయంతో నేర్చుకుంది. కేవలం మూడు నెలల్లోనే అనుభవజ్ఞులు నడిపినట్టు కారు నడపసాగింది. హైవే మీద 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

కారు డ్రైవింగ్​ నేర్చుకోవడం కన్నా ముందు తనకు ట్రాక్టర్​ నడిపిన అనుభవం ఉందన్నారు రేషమ్​ బాయ్​.

"ఇంట్లో అందరికీ డ్రైవింగ్​ వచ్చు. మనవళ్లు, మనవరాళ్లు కూడా డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల నాకు కూడా ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఉంటే బోర్​ కొడుతోంది. అది కూడా నేను డ్రైవింగ్​ నేర్చుకోవడానికి ఓ కారణం."

-రేషమ్​ బాయ్​

ఇప్పటివరకు ఎక్కువ దూరం డ్రైవ్​ చేయలేదని.. లైసెన్స్​ వచ్చాక భోపాల్​ వరకు కారులో వెళ్లి వస్తానని చెప్పుకొచ్చింది. కారు నడపగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

90 ఏళ్ల వయసులోనూ తన పని తాను చేసుకుంటూ కుటుంబసభ్యులకు వ్యవసాయంలో సాయం చేస్తూ ఉంటుందీ బామ్మ. ఇంకా ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​ అంటే కూడా ఆసక్తి అని.. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్స్​ అంటే మరింత మక్కువ అని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనకు వయసుతో సంబంధం ఉండదని నిరూపించిన ఈ బామ్మ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి :సోషల్​ మీడియా ఎఫెక్ట్​: భర్త పళ్లు రాలగొట్టిన భార్య!

Last Updated : Sep 25, 2021, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details