తెలంగాణ

telangana

తాజ్​మహల్​ వద్ద కోతులు రచ్చ రచ్చ.. పర్యటకులు హడల్!

By

Published : Sep 19, 2022, 10:05 PM IST

tajmahal

ప్రపంచ ప్రఖ్యాత తాజ్​మహల్ వద్ద మరోసారి కోతులు రెచ్చిపోతున్నాయి. తాజ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులపైకి దాడులకు తెగబడుతున్నాయి. కంట కనపడ్డ వారి రక్తం కళ్ల చూసే వరకు వదిలిపెట్టడం లేదు. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తగా మళ్లీ వానరాలు వీరవిహారం చేస్తున్నాయి. కోతుల దాడులతో తాజ్​మహల్​ను సందర్శించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రకృతి ప్రేమికులు జంకుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత తాజ్​మహల్​ను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యటకులు వస్తారు. అయితే గతకొన్ని రోజులుగా ఇక్కడికి వస్తున్న పర్యాటకులను కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల తాజ్​మహల్​ను చూసేందుకు వచ్చిన అతిథులపై వానరాల దాడి పెరుగుతోంది. పర్యటకులపైకి దూకి కోతులు రక్కుతున్నాయి. దీంతో వానరాల దాడి విషయం తెలుసుకున్న పర్యాటకులు తాజ్ వైపు చూడాలంటేనే భయంతో వణికిపోతున్నారు. వీరిలో మనదేశంతోపాటు విదేశీ ప్రయాణికులు ఉండటం కొసమెరుపు.

తాజాగా సోమవారం ఉదయం స్పెయిన్​కు చెందిన మహిళపై కోతి దాడిచేసింది. దీంతో ఆమె బోరున విలపించింది. కోతిని ఫొటో తీసేందుకు యత్నించగా.. ఆమె కాలును కొరికినట్లు తాజ్వద్ద ఉండే పురావస్తు శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. తక్షణమే ఆమెకు ప్రథమచికిత్స అందించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గత కొన్నిరోజులుగా తాజ్పరిసరాల్లో కోతుల దాడులు పెరిగినట్లు అక్కడ ఉండే ఫొటోగ్రాఫర్ పేర్కొన్నారు. కొంతమంది పర్యటకులు స్థానిక పురావస్తు శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పర్యటకుల ఫిర్యాదులతో స్పందించిన ఉన్నతాధికారులు.. కోతుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. కోతుల బెడదను అరికట్టాలని.. స్థానిక అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినట్లు పురావస్తు అధికారులు తెలిపారు.

ఈనెల 11న తమిళనాడు పర్యటకునిపై.. ఆ మరుసటి రోజు స్వీడన్​ మహిళపై, 14న మరో ఇద్దరు విదేశీ పర్యాటకులపైనా వానరాలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. కోతులకు అతిసమీపానికి వెళ్లడం, వాటితో ఫొటోలు తీసుకోవడమే.. అవి దాడి చేయడానికి ప్రధాన కారణమని.. అధికారులు చెబుతున్నారు. వరుస దాడుల నేపథ్యంలో స్థానికంగా ప్రథమ చికిత్సతోపాటు రెండు అంబులెన్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలోనూ తాజ్మహల్వద్ద ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​లో పర్యటించినపుడు తాజ్​ను సందర్శించారు. ఆ సమయంలో కోతులు ఇతర జంతువులను తరిమికొట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.

ఇవీ చదవండి:'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్!

ABOUT THE AUTHOR

...view details