తెలంగాణ

telangana

ప్రశాంతంగా ముగిసిన దిల్లీ మున్సి'పోల్స్​'.. ఓటర్లకు మాత్రం చుక్కలే!

By

Published : Dec 4, 2022, 5:35 PM IST

Updated : Dec 4, 2022, 7:50 PM IST

MCD Polls 2022: దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. చలితీవ్రత ఎక్కువగా ఉన్నా వృద్ధులు సహా అన్నివర్గాల ప్రజలు కూడా ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. రాజకీయ ప్రముఖులు కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివచ్చిన పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. తమ పోలింగ్‌ బూత్‌ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడం వల్ల మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరిగారు.

MCD POLLS 2022
MCD POLLS 2022

Delhi Muncipality Polls 2022: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.... సాయంత్రం ఐదున్నర గంటలకు ముగిసింది. చలితీవ్రత ఎక్కువగా ఉన్నా వృద్ధులుసహా అన్నివర్గాల ప్రజలు కూడా ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. రాజకీయ ప్రముఖులు కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు 50 శాతం ఓటింగ్​ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీమంత్రి హర్షవర్దన్‌, భాజపా ఎంపీ పర్వేష్‌ వర్మ, ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌, ఆల్కా లాంబ సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దిల్లీ వెలుపల కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 7న వెలువడనున్నాయి.

ఓటు వేసేందుకు క్యూలైన్​లో ప్రజలు

ఆప్‌, భాజపా రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్‌ మాత్రం పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్న ఆకాంక్షతో ఉంది. తాజాగా వార్డుల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి మున్సిపల్‌ ఎన్నికలు ఇవే. 2020 దిల్లీ అల్లర్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కూడా కావడం గమనార్హం.

పెళ్లి దుస్తులతో ఓటు వేసేందుకు..
ఆదివారం జరిగిన దిల్లీ మున్సిపల్​ ఎన్నికలకు ఓ కొత్త పెళ్లికొడుకు తన భార్యతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చాడు. పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్​ బూత్​కు వచ్చి ఓటు వేశాడు. బిజ్నోర్​కు చెందిన సుధీర్​ రాణాకు ఆదివారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. అనంతరం పెళ్లి దుస్తులతో బురారా అసెంబ్లీ పరిధిలో ఉన్న తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతీ పౌరుడి బాధ్యత అని తెలిపారు.

పెళ్లి దుస్తులతో ఓటు వేసేందుకు..

ఎన్నికల నిర్వహణలో అధికారుల వైఫల్యం
దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివచ్చిన పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. తమ పోలింగ్‌ బూత్‌ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడంతో మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరిగారు. పోలింగ్‌ నిర్వహణ తీరుపట్ల ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

'పోలింగ్‌ బూత్‌ కోసం 2గంటలు తిరిగాం'
దిల్లీలోని మొత్తం 250 వార్డులకు జరుగుతున్న త్రిముఖ పోరులో భాజపా-ఆప్‌-కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజలంతా బాధ్యతగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఓటేసేందుకు వచ్చిన కొందరు ఓటర్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అనేకమంది అయోమయానికి, అసహనానికి గురవుతున్నారు. ఒక్కో ఓటరుకు ఒక్కోరకమైన అనుభవం ఎదురవుతోంది.

"నేను ఒక గంటకు పైగా నా బిడ్డను పట్టుకొని పోలింగ్‌ బూత్‌ కోసం తిరుగుతున్నా. కానీ ఇప్పటికీ నా బూత్‌ ఎక్కడుందో తెలియలేదు. వేర్వేరు బూత్‌లకు అధికారులు పంపుతున్నారు. నా భార్య ఓటు వేసింది. కానీ నేను వేయలేకపోయా. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినా ఎక్కడ ఓటు వేయాలో ఎవరికీ అర్థంకావడంలేదు" అని కౌల్‌ రామ్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, దాదాపు 20మందికి పైగా కుటుంబ సభ్యులు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చినా.. ఎక్కడ ఓటు వేయాలో తెలియక తిరిగి వెళ్లిపోతున్నట్టు ఓ మహిళ తెలిపారు. రెండు గంటల పాటు పోలింగ్‌ కేంద్రానికి తిరిగామని.. అక్కడ తమకు ఓట్లు లేవని చెప్పి వేర్వేరు బూత్‌లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ తమ ఓట్లు ఉన్నాయో తెలియకపోతే ఎలా వేయగలం అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.

జాబితాలో పేర్లు లేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు

తొలిసారి ఓటేద్దామని వచ్చా..
"గత రెండు గంటల వ్యవధిలో వివిధ పోలింగ్‌ కేంద్రాల్లోని ఏడెనిమిది బూత్‌లకు వెళ్లాలని అధికారులు సూచించారు. నేను నా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆశగా వచ్చాను. కానీ ఓటేయలేకపోయా. ఇది సరైన పద్ధతి కాదు. చివరకు ఓటు వేయకుండానే వెళ్లిపోతున్నా" అని తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉత్సాహంతో వచ్చిన యువతి వాపోయారు. అలాగే, వృద్ధులకూ ఇదేరకమైన సమస్య ఎదురవుతోంది. పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో తెలుసుకొనేందుకు తాము ఒకచోట నుంచి ఇంకోచోటకు తిరిగే ఓపిక లేకపోవడంతో తిరిగివెళ్లిపోవాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.

ఓటర్ల జాబితాలో చాలా పేర్లు లేవు.. ఇదో కుట్ర: సిసోడియా
దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో అనేకమంది పేర్లు గల్లంతయ్యాయని, ఇదంతా ఓ కుట్ర అని డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. అనేకమంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు తమ జాబితాలోతమ ఓట్లు లేవని వాపోతున్నారన్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ఈ కుట్రపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఓటరు జాబితాలు అప్‌డేట్‌ కాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనట్టు పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు చెబుతున్నారు. కొందరు ఓటర్ల సరైన అడ్రస్‌లు అప్‌డేట్‌ కాలేదని.. ఆధార్‌ కార్డులను లింక్‌ చేయకపోవడం, ఇతర సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు చెబుతున్నారు.

Last Updated : Dec 4, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details