తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమంలో స్వదేశీ జ్వాలను రగిలించిన అగ్గిపెట్టే

By

Published : Oct 29, 2021, 8:19 AM IST

మంట రగిలించే అగ్గిపుల్ల... జాతీయోద్యమంలోనూ (Azadi Ka Amrit Mahotsav) అదే పాత్ర పోషించింది. గాంధీజీ కంటే ముందే మనవాళ్లలో స్వదేశీ భావనను జ్వలింపజేసింది. స్వాతంత్య్రోద్యమాన్ని వినూత్నంగా వంటింటి ద్వారా ఇంటింటికీ చేర్చింది.

Azadi Ka Amrit Mahotsav
అగ్గిపెట్టెతో స్వదేశీ జ్వాల

పందొమ్మిదో శతాబ్ది చివర్లో అగ్గిపెట్టెలను యూరప్‌లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసేవారు. కోల్‌కతాలో స్థిరపడ్డ జపనీయుల సాయంతో 1905-10 మధ్య తొలిసారిగా భారత్‌లో అగ్గిపెట్టెల తయారీ మొదలైంది. తొలి ప్రపంచయుద్ధం తర్వాత ఈ పరిశ్రమ తమిళనాడుకు తరలింది. యూరప్‌ నుంచి దిగుమతి అయినప్పుడు అగ్గిపెట్టెలపై పాశ్చాత్యదేశాల బొమ్మలే ఉండేవి. కానీ ఎప్పుడైతే భారత్‌లో తయారవటం మొదలైందో వాటిపై స్థానిక దేవుళ్ల బొమ్మలు ముద్రించారు. ఇంతలో జాతీయోద్యమంలో తిలక్‌ తదితరులు అప్పుడప్పుడే స్వదేశీ మంత్రం పఠించటం మొదలైంది. బెంగాల్‌ విభజనను నిరసిస్తూ కోల్‌కతాలో ప్రజానీకం స్వదేశీ ఉద్యమానికి (Azadi Ka Amrit Mahotsav) సిద్ధమైంది. బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా విదేశీ వస్తువుల కొనుగోలు ఆపేసి... స్వదేశీ ఉత్పత్తులే కొనాలని పిలుపునిచ్చింది. అందరికంటే ముందు అగ్గిపెట్టెల పరిశ్రమ దీన్ని అందిపుచ్చుకుంది. దేవుళ్ల స్థానంలో జాతీయోద్యమ నేతలు, స్వదేశీ భావనను రేకెత్తించే ఫొటోలను ముద్రించటం మొదలైంది.

వివేకానందుడు, వందేమాతరం బొమ్మలు అగ్గిపెట్టెలపై ఆకట్టుకున్నాయి. తద్వారా దేశభక్తితో తమ అమ్మకాలు పెంచుకునేందుకు అగ్గిపెట్టెల ఉత్పత్తిదారులు పోటీపడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా స్థానిక భాషల్లో ఇదే పునరావృతమైంది. కొద్దిరోజులకు మరింత వినూత్నంగా సినిమాలకు, జాతీయోద్యమానికి ముడిపెడుతూ కూడా ఈ అగ్గిపెట్టెలను ప్రచారానికి వేదికగా వాడుకోవటం విశేషం. 1931లో హిందీలో వచ్చిన తొలి టాకీ సినిమా ఆలం ఆరాను... గాంధీ-ఇర్విన్‌ ఒప్పందంతో ముడిపెట్టి అగ్గిపెట్టెలపై ముద్రించారు. అదే ఏడాది గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం జరిగింది. ఫలితంగా ఉప్పుసత్యాగ్రహం ముగిసింది. తర్వాత గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, నెహ్రూ...ఇలా చాలామంది స్వాతంత్రోద్యమ నేతల బొమ్మలకు, నినాదాలకు అగ్గిపెట్టెలు వేదికయ్యాయి. 1947 దాకా జాతీయోద్యమాన్ని రగిల్చి ఆ జ్వాలను కొనసాగించడంలో వీటి పాత్ర మరవలేనిది.

ఇదీ చూడండి:కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు

ABOUT THE AUTHOR

...view details