తెలంగాణ

telangana

'ఇంకెంత కాలం బతుకుతానో తెలియదు.. నన్ను చంపాలనుకున్నా పేదల కోసం పోరాటంలో తగ్గేదేలే!'

By

Published : May 8, 2023, 4:00 PM IST

81 ఏళ్ల తాను ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలియదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తనను చంపాలనుకున్నా.. పేదల కోసం పనిచేయడాన్ని, వారి తరఫున చేసే పోరాటాన్ని ఆపలేరంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

kharge karnataka assembly elections 2023
kharge karnataka assembly elections 2023

పేదల కోసం పోరాడకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. తాను కర్ణాటక భూమి పుత్రుడిని అని.. ఆ పేరుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని ఆయన కోరారు. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో సోమవారం ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఖర్గే.. ఉద్వేగంగా మాట్లాడారు. ప్రత్యర్థి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

81 ఏళ్ల తాను ఎంతకాలం బతుకుతానో తెలియదని ఖర్గే అన్నారు. తనను చంపాలనుకున్నా.. పేదల కోసం పనిచేయడాన్ని, వారి తరఫున చేసే పోరాటాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. తన హత్యకు కుట్రపన్నారని చెప్పిన వ్యక్తి వెనుక బీజేపీ నేత ఉన్నారని ఆరోపించారు. "నన్ను అంతమొందించాలనే ఆలోచన బీజేపీ నేతలకు వచ్చి ఉండవచ్చు.. లేకపోతే ఖర్గేను, కుటుంబాన్ని అంతమొందించాలనుకుంటున్నానని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? నన్ను ఎవరూ అంత తేలికగా చంపలేరు. నన్ను రక్షించేందుకు బాబాసాహెబ్ రాజ్యాంగం ఉంది. కర్ణాటక ప్రజలు నా వెనుక ఉన్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాక దేశ ప్రజలంతా నా వెంటే ఉన్నారు. మీరు నన్ను, నా కుటుంబాన్ని అంతం చేయవచ్చు.. నేను పోతే మరొకరు పుట్టవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే మా కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారు" అని ఖర్గే వ్యాఖ్యలు చేశారు.

"ఒక మనిషి 100 లేదా 90 సంవత్సరాల వరకు జీవించవచ్చు. కానీ మన దేశంలో మనిషి సగటు జీవితం 70 లేదా 71 ఏళ్లు. నేను ఇప్పటికే బోనస్​లో ఉన్నాను. నాకు ఇప్పుడు 81 సంవత్సరాలు.. నేను బతికితే ఇంకో ఎనిమిది, తొమ్మిదేళ్లు బతకొచ్చు. కంగారు పడకండి. అంతకుముందే నన్ను అంతం చేయాలనుకుంటే మీ సమస్యలు తీరితే చంపేయండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా చివరి శ్వాస వరకు నేను పేదల కోసం పోరాడుతూనే ఉంటాను. మీరు (ప్రజలు) నాతో ఉన్నంత వరకు నాకేం భయం లేదు"

- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు

కలబురగి ప్రజల ఆశీర్వాదం వల్లే తాను పలు హోదాల్లో పని చేశానని, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా సోనియా తనకు రాజ్యాధికారం ఇచ్చారని ఖర్గే అన్నారు. తనకు ఏఐసీసీ అధ్యక్ష పదవి దక్కడం కలబురగి గర్వించదగ్గ విషయమని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌లోని ఒక ఇంజిన్ కర్ణాటక విఫలమైందని ఖర్గే ఎద్దేవా చేశారు. 2024లో కేంద్రంలో మరో ఇంజన్ కూడా ఓడిపోతుందని జోస్యం చెప్పారు

'అలా మాట్లాడినందుకు కాంగ్రెస్​ గుర్తింపు రద్దు చేయాలి'
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సార్వభౌమాధికారం పదాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎన్నికల కమిషన్‌కు కమలం పార్టీ ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వంలోని బీజేపీ బృందం.. ఈసీకి మెమొరాండం అందించింది. దేశంలో కర్ణాటక చాలా ముఖ్యమైన రాష్ట్రమని.. అలాంటి కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడితే అది వేర్పాటువాదానికి దారితీస్తుందని బీజేపీ ఆరోపించింది.

ఇటీవల హుబ్బళ్లి ప్రచారసభలో పాల్గొన్న సోనియాగాంధీ.. ఆరున్నర కోట్ల కర్ణాటక ప్రజల.. ప్రతిష్ఠ, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించే వారు ఎవరినీ కాంగ్రెస్ అనుమతించదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ చేసిన ట్వీట్‌ కాపీని కూడా ఈసీకి బీజేపీ అందించింది. సోనియాపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కోరారు.

'ఎన్నికల సంఘం.. బీజేపీ పక్షపాతి!'
బీజేపీ అవినీతి అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తున్న 'కరప్షన్‌ రేట్‌ కార్డ్‌'పై ఆదివారం సాయంత్రంలోగా ఆధారాలను సమర్పించాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో హస్తం పార్టీ మండిపడింది. ఎన్నికల సంఘం బీజేపీ పక్షపాతి అని ఆరోపించింది. మోదీతో పాటు అనేక మంది బీజేపీ నాయకులు.. ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. కానీ కమిషన్​ ఒక్కసారి కూడా బీజేపీకి నోటీస్​ ఇవ్వలేదని ఆరోపించింది. ఎన్నికల కమిషన్​ తమకు ఇచ్చిన నోటీసుపై స్పందించేందుకు 24 గంటలు సరిపోదని కాంగ్రెస్​ పార్టీ న్యాయవాది అభిషేక్​ మనుసింఘ్వీ తెలిపారు.

'మోదీకి ఎందుకు నోటీసులు ఇవ్వరు?'
ఈ విషయంపై కాంగ్రెస్​ పార్టీ ఎంపీ కపిల్ సిబల్​ కూడా స్పందించారు. తమ పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ప్రధానిని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని ఎందుకు అడగటం లేదని ఈసీని ఆయన ప్రశ్నించారు. తమకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని వ్యాఖ్యానించడం ద్వారా మోదీ లక్ష్మణరేఖను దాటారని ఆయన విమర్శించారు.

ఎలాంటి నిర్ధరణ లేని అవినీతి ఆరోపణలతో ఒక వార్తాపత్రికలో కాంగ్రెస్ అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చిందంటూ బీజేపీ ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ ఈ నోటీసులు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, కమీషన్లకు సంబంధించి ప్రకటనల్లో ఇచ్చిన రేట్లకు సంబంధించిన సాక్ష్యాలను అందజేసి పబ్లిక్ డొమైన్‌లో వాటిని ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీని ఈసీ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ట్రబుల్ ఇంజన్‌గా పేర్కొంటూ 2019-2023 మధ్య అవినీతి రేట్లతో కాంగ్రెస్ పార్టీ పలు పోస్టర్లు, అడ్వర్‌టైజ్‌మెంట్లు విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details