తెలంగాణ

telangana

పార్లమెంట్​కు రాహుల్​ రీఎంట్రీ.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ

By

Published : Aug 7, 2023, 10:38 AM IST

Updated : Aug 7, 2023, 12:23 PM IST

Rahul Gandhi Lok Sabha Membership : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. రాహుల్​పై వేసిన అనర్హతను లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్ ఓం బిర్లాకు అందజేయడం వల్ల.. ఆయన అనర్హత వేటు ఎత్తివేసే దస్త్రాలపై సంతకం చేశారు. వెంటనే లోక్‌సభ సచివాలయం రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం వల్ల కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Wayanad MP Rahul Gandhi
Wayanad MP Rahul Gandhi

Rahul Gandhi Lok Sabha Membership : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వేసిన అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. రాహుల్‌ అనర్హత ఎత్తివేతతో దిల్లీలోని 10 జన్‌పథ్ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు. ఖర్గే స్వయంగా నేతలు అందరికీ స్వీట్లు తినిపించారు. రాహుల్‌పై అనర్హతను ఎత్తివేస్తూ సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. దేశ ప్రజలకు, ముఖ్యంగా వయనాడ్‌ ప్రజలకు ఇదో గొప్ప ఊరటని అన్నారు.

నిషేధం ఎత్తివేతతో రాహుల్‌ గాంధీ.. మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌ సోమవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8వ తేదీ నుంచి లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు.

Modi Surname Remark By Rahul Gandhi : 2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై గుజరాత్‌లో కేసు నమోదు కాగా ఈ ఏడాది మార్చి 23న సూరత్‌లోని సెషన్స్‌ కోర్టు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలు శిక్ష పడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. దీంతో వారి సభ్యత్వం రద్దవుతుంది. అంతేగాక, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికీ వీలుండదు. ఈ తీర్పుపై అహ్మదాబాద్‌ హైకోర్టులో ఊరట లభించకపోవడం వల్ల రాహుల్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 4 తేదీన విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. జైలు శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో అనర్హత ముప్పు నుంచి రాహుల్‌ బయటపడ్డారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ రాహుల్‌ పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.

ఇవీ చదవండి:

పార్లమెంట్​లో రాహుల్ అడుగుపెట్టేనా?.. స్పీకర్​ నిర్ణయంపై ఉత్కంఠ.. ఏం జరుగుతుందో?

Last Updated : Aug 7, 2023, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details