తెలంగాణ

telangana

Leopard Trapped: బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న భక్తులు

By

Published : Jun 24, 2023, 9:39 AM IST

Updated : Jun 24, 2023, 1:05 PM IST

Leopard Trapped in Tirumala: తిరుమలలో మొన్న రాత్రి బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. ఈవో ఆదేశాల మేరకు చిరుత పులి సంచారం తెలుసుకున్నామన్న DFO శ్రీనివాసులు.. దాన్ని పట్టుకునేందుకు 2 బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leopard Trapped in Tirumala
Leopard Trapped in Tirumala

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న భక్తులు

Leopard Trapped in Tirumala: తిరుమల నడక దారిలో మూడు సంవత్సరాల బాలుడిపై గురువారం దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గం ఏడో మైలు వద్ద చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మెట్ల మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు.. చిరుత సంచారాన్ని గమనించి శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఇనుప బోన్లను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి 10:45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. బోనులో చిక్కిన చిరుతను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అలిపిరి మెట్ల మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత బోనులో చిక్కుకోవడంతో.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ నడక దారిలో వెళుతున్న శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు.

చిరుత బోనులో చిక్కుకున్న ప్రదేశాన్ని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బాలుడిపై దాడిచేసిన రోజే.. చిరుత సంచారాన్నిగుర్తించామన్నారు. తల్లి చిరుత కూడా అదే ప్రాంతంలో సంచరిస్తోందని.. దాన్ని కూడా పట్టుకుని దూరంగా వదిలేస్తామని ప్రకటించారు. తల్లి పులి జాడ కూడా కెమెరాల్లో తెలిసిందన్నారు. తల్లి పులి ఎప్పుడూ మనుషులపై దాడి చేయలేదని... మొన్న పిల్లిని వేటాడపోయి బాలుడిపై చిరుత దాడి చేసిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

దాడి చేసిన ప్రాంతాన్ని మరోమారు పరిశీలించిన ఈవో ధర్మారెడ్డి: అలిపిరి నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

బృందాలుగా భక్తులు: బాలుడిపై చిరుత దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో కొన్ని మార్పులు చేశారు. రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలి గోపురం నుంచి 200 మంది చొప్పున భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డ్‌ కూడా ఉంటారు. అలాగే చిన్న పిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని అప్రమత్తంగా వెళ్లాలే ఏర్పాటు చేశారు. అలిపిరి మార్గంలో రాత్రి 10 వరకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల తరువాత ఘాట్‌రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధికారులు ఆలోచిస్తున్నారు.

Last Updated : Jun 24, 2023, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details