తెలంగాణ

telangana

జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం క్లారిటీ.. త్వరలోనే...

By

Published : Jul 22, 2022, 3:41 PM IST

Jamili elections 2022: జమిలీ ఎన్నికల నిర్వహణపై న్యాయ సంఘం​ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ ప్రణాళిక సిద్ధమవుతుందని అన్నారు కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు. మరోవైపు దేశంలో యూనిఫామ్​ సివిల్​ కోడ్​ అమలుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి పలు కేసులపై కోర్టులో విచారణ జరగుతున్న నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి​ అమలు ప్రస్తుతం ఉండదని స్పష్టం చేశారు.

పార్లమెంట్
పార్లమెంట్

Jamili elections: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్​సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం న్యాయ సంఘం​ పరిశీలనలో ఉందని పేర్కొంది. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపింది. లోక్​సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ కిరణ్ రిజిజు.

"స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా న్యాయ సంఘం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. తరచుగా వచ్చే ఎన్నికలు.. నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపింది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది."

-కిరణ్​ రిజిజు, న్యాయశాఖ మంత్రి

యూనిఫామ్​ సివిల్​ కోడ్​..: మరోవైపు.. యూనిఫామ్​ సివిల్​ కోడ్​ వ్యవహారంపై స్పందించిన రిజిజు.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కొన్ని పిటిషన్లపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు. వాటిపై కోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :అత్తమామలు డైరీ చదివారని.. యువతి ఆత్మహత్య.. అందులో ఏముందంటే?

ABOUT THE AUTHOR

...view details