తెలంగాణ

telangana

కరోనాతో కుదేలైన ఆ రాష్ట్రంపై జికా పంజా!

By

Published : Jul 11, 2021, 3:38 PM IST

Updated : Jul 11, 2021, 7:01 PM IST

తొలిదశలో కరోనా వైరస్​ను విజయవంతంగా కట్టడి చేసిన రాష్ట్రం కేరళ. రెండో వేవ్​లోనూ కొంతవరకు బాగానే నియంత్రించగలిగింది. అయితే, దేశవ్యాప్తంగా రెండో ఉద్ధృతి తగ్గినప్పటికీ.. ఆ రాష్ట్రంలో మాత్రం కేసుల సంఖ్య ఒకే స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

KERALA VIRUS CASES
కేరళ కరోనా

కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న రోజువారీ కేసులను అదుపుచేయడానికి పోరాడుతున్న వైద్య అధికారులకు.. జికా వైరస్​ రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది.

అంటువ్యాధిని అదుపుచేయడంలో సఫలమై.. గతేడాది 'కేరళ మోడల్'​ గా ప్రశంసలు పొందిన రాష్ట్రంలో.. ప్రస్తుతం రోజుకు సరాసరి 12 నుంచి 15 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. దీనిని 'దీర్ఘకాల ఉప్పెన'గా నిపుణులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో శనివారం నమోదైన 14,087 కొత్త కేసులతో వ్యాధిగ్రస్థుల సంఖ్య 30,39,029కి పెరిగింది. మరో 109 మరణాలతో వైరస్​కు బలైన వారి సంఖ్య 14,380కు చేరింది. ప్రస్తుతం 1,13,115 యాక్టివ్ కేసులున్నాయి.

అన్​లాక్​ చర్యల కారణంగా వైరస్​ కేసులు పెరిగాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ ఇటీవలే అన్నారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని ఆమె చెప్పారు.

జూన్​ 1న రాష్ట్రంలో 19,760 పాజిటివ్​ కేసులు బయటపడగా.. కాస్త తగ్గుతూ వచ్చి జూన్​ 7న 9,313 కేసులు నమోదయ్యాయి. తర్వాత రెండు రోజులకే అమాంతం 16,204కు పెరిగాయి. ఆ నెలలో సరాసరి 11 నుంచి 13 వేల మధ్య కేసులు వెలుగుచూశాయి.

గతేడాది జనవరిలో తొలి కరోనా వైరస్​ కేసు కేరళలోనే బయటపడటం గమనార్హం.

"కేసుల వృద్ధి స్థిరంగా కొనసాగితే వైరస్​ను అదుపు చేయడం సులభమవుతుంది. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. దాంతో మూడో వేవ్​ రాకుండా నిరోధించడం, కొత్త వేరియంట్లను కనుగొనడంలో వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి వీలవుతుంది. కానీ, అది దీర్ఘకాలం కొనసాగితే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై మరింత ఒత్తిడి నెలకొంటుంది." అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైరస్​ సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరగకుండా నివారణ చర్యలు తీసుకున్న కేరళ ప్రభుత్వాన్ని పలువురు వైద్య నిపుణులు ప్రశంసిస్తుంటే.. అన్​లాక్​ తర్వాత నిబంధనల అమలులో వైఫల్యం కారణంగా కేసులు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు. టీకా పంపిణీ ముఖ్యమని, వాటికోసం కేవలం కేంద్రంపై ఆధారపడకుండా ఎలాగైనా సేకరించి తీరాలని అంటున్నారు.

దీర్ఘకాల సాంక్రమణ రేటు సహా మూడో వేవ్​ సంభవిస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని డా.టీఎస్ అనీశ్ హెచ్చరించారు. రెండో దశలో కేసులు పెరగకుండా లాక్​డౌన్​ విధించి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ప్రభుత్వం చేయగలిగిందన్నారు. అయితే అన్​లాక్​తో మద్యం షాపుల వద్ద ప్రజలు గుమిగూడేందుకు అనుమతించడాన్ని ఆయన తప్పుబట్టారు.

పరీక్షల వల్లే..

వేరే రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు బయటపడకపోవడానికి కేరళ తరహాలో గ్రామీణ జనాభాకు పరీక్షలు నిర్వహించకపోవడమే కారణమని వైరాలజిస్ట్ డా. శారద అన్నారు. ​

కరోనా కేసులను గుర్తించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోందని కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ అమర్ ఫీటిల్ పేర్కొన్నారు. తద్వారా అధిక ముప్పు కలిగి ఉన్న ప్రజలను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతోందని తెలిపారు. సుదీర్ఘ లాక్​డౌన్ తర్వాత చాలా మంది ప్రజలు బయట తిరుగుతున్నారని, కాబట్టి వైరస్ వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. పరీక్షలు అధికంగానే చేస్తున్న నేపథ్యంలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని వివరించారు. తక్కువ సమయంలో ఒక్కసారిగా కేసులు విస్ఫోటం చెందడం కంటే.. సుదీర్ఘ కాలం పాటు భారీగా వైరస్ కేసులు బయటపడటం మంచిదేనని అన్నారు. అయితే, వైరస్ కేసులు ఎప్పుడు తగ్గుతాయనే విషయంపై స్పష్టత లేదని అన్నారు.

లక్ష్యం అదే

రాష్ట్ర వైద్య వ్యవస్థ సామర్థ్యానికి మించి కేసులు బయటపడకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. పడకలు, ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించకూడదని అన్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వ్యాక్సినేషన్​ ఏకైక మార్గమని చెప్పారు.

"వ్యాక్సినేషన్​తో పాటు ప్రజలు గుంపులుగా తిరగకుండా ఉండేందుకు లాక్​డౌన్​లు, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఉత్తమం. ప్రజలు కరోనా నియమాలు పాటించేలా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాం."

-వీణా జార్జ్, కేరళ వైద్య శాఖ మంత్రి

మరోవైపు, కేరళలో జికా వైరస్​ కేసుల సంఖ్య 18కి చేరింది. ఆదివారం కొత్తగా మూడు కేసులు బయటపడ్డాయి. ఇందులో 22 నెలల చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో జికా ప్రబలడం ఆందోళనకరంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు కేంద్ర బృందాలు కేరళకు చేరుకున్నాయి.

ఇదీ చదవండి:జికా వైరస్​పై కేంద్రం హైఅలర్ట్- ప్రత్యేక బృందంతో...

Last Updated : Jul 11, 2021, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details