తెలంగాణ

telangana

45 ఏళ్ల తర్వాత బతికొచ్చిన వ్యక్తి!

By

Published : Jul 27, 2021, 6:38 PM IST

పని నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి.. విమానం కూలిన ఘటనలో మరణించాడని అందరూ అనుకున్నారు. కానీ, 45 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి బతికున్నాడని తెలిసింది. అసలేం జరిగిందంటే..

kerala man
కేరళ వాసి, కేరళ వ్యక్తి

22 ఏళ్ల వయసులో కుటుంబాన్ని వదిలేసి అబుదాబికి వెళ్లాడు ఓ వ్యక్తి. రెండేళ్ల పాటు అక్కడే పనిచేసి ఇంటికి బయలుదేరాడు. అంతలోనే.. విమానం కుప్పకూలి మద్రాసుకు వెళ్తున్న 95మంది ప్రయాణికులు మరణించారని తెలిసింది. వారిలో ఆ వ్యక్తి కూడా ఉన్నారని కుటుంబసభ్యులు భావించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ వ్యక్తి బతికే ఉన్నాడని తెలిసింది. అసలేం జరిగిందంటే..

ఇదీ జరిగింది..

కేరళ కొట్టాయంకు చెందిన సాజిద్​ తుంగల్(70).. 1974లో పని నిమిత్తం అబుదాబి వెళ్లాడు. నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెళ్లెళ్లను వదిలేసి.. 22ఏళ్ల వయసులోనే అబుదాబికి పయనమయ్యాడు.

రెండేళ్లకు తిరిగి ఇండియాకు వద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే 1976లో మద్రాస్​కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్​లైన్స్ విమానం కుప్పకూలిందని, అందులో ప్రయాణిస్తున్న 95 మంది మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో తుంగల్ కూడా మృతిచెందాడని కుటుంబసభ్యులంతా భావించారు.

కానీ, తుంగల్​ బ్రతికే ఉన్నాడు. అంత ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ ఇంటికి వెళ్లలేదు! కుటుంబ సభ్యుల దగ్గరకు తిరిగివెళ్లేందుకు మనసు రాలేదని, అందుకే తాను బతికున్నట్లు వారికి సమాచారం అందించలేదని చెప్పుకొచ్చాడు. 1982లో ముంబయికి తిరిగి వచ్చి జీవనం సాగిస్తున్నట్లు చెప్పాడు.

"జీవితంలో ఓడిపోయానని అనిపించింది. అందుకే కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాను. గల్ఫ్​లో ధనికుడినవ్వాలని ఆశించాను. కానీ, అదృష్టం కలిసిరాలేదు. ముంబయికి వచ్చాక కాస్త సంపాదించి కుటుంబ సభ్యులను కలవాలి అనుకున్నా. అది కూడా సాధ్యపడలేదు. ఇలా క్రమంలో 45 ఏళ్లు గడిచిపోయాయి."

--సాజిద్ తుంగల్.

ఆచూకీ తెలిసిందిలా..

రెండేళ్ల క్రితం తుంగల్ నిస్సహాయస్థితిలో ఉండటం గ్రహించి ఆయన స్నేహితుడు ఒకరు తుంగల్​ను ఓ ఆశ్రమంలో చేర్పించారు. ఆ ఆశ్రమం నడిపిస్తున్న పాస్టర్​ కేఎమ్ పిలిప్​కు తుంగల్​ కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో.. తుంగల్​ కుటుంబ వివరాలన్నీ తెలుసుకున్న తరువాత ఆయనను చూసి పాస్టర్​ ఫిలిప్ నిర్ఘాంతపోయారు. వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ విషయం విన్న తుంగల్​ కుటంబ సభ్యులు షాక్​ అయ్యారు. వెంటనే తనను కలిసేందుకు ముంబయి బయలుదేరారు. బుధవారం తుంగల్​ను కలవనున్నారు.

విమానం కూలిందని తెలిసిన వెంటనే తుంగల్​ సోదరుడు కుంజు.. అయన కోసం వెతుక్కుంటూ అబుబాబికి కూడా వెళ్లారు. అయినప్పటికీ ఆచూకీ తెలియలేదని, 45ఏళ్ల తర్వాత ఆయన బతికున్నట్లు తెలియడం అశ్చర్యంగా అనిపించిదని కుంజు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులెవరూ ఆయనను మరచిపోలేదని.. ఇప్పుడు ఆయనను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:102ఏళ్ల మర్రిచెట్టుకు పుట్టినరోజు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details