తెలంగాణ

telangana

Joshimath Sinking : సొంత గూళ్లను వీడని జోషీమఠ్​ ప్రజలు.. శిబిరాల నుంచి స్వస్థలాలకు..

By

Published : Jan 10, 2023, 6:48 AM IST

Joshimath Sinking: కాళ్ల కింద నేల కదిలిపోతున్నా, కళ్లెదుటే భవనాలు బీటలు వారుతున్నా తమ ఇళ్లను వీడమంటున్నారు జోషీమఠ్​ ప్రజలు. సురక్షిత శిబిరాలకు వెళ్లిన వారు కూడా ఇళ్లకు తిరిగి వస్తున్నారు. మరోవైపు, రోజు రోజుకు జోషీమఠ్​ ప్రాంతంలో మరిన్ని ఇళ్లు పగుళ్లకు గురవుతున్నాయి. దీంతో ప్రతి క్షణం ముఖ్యమే అని అధికారులు చెబుతున్నారు.

JOSHIMATH sinking NEWS
JOSHIMATH sinking NEWS

Joshimath Sinking: కాళ్ల కింద నేల కదిలిపోతున్నా, కళ్లెదుటే భవనాలు బీటలు వారుతున్నా ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ను వీడి వేరేచోటుకు రాబోమని స్థానికులు కరాఖండీగా చెబుతున్నారు. భూమిలో కదలికల వల్ల భవంతులు ప్రమాదకరంగా మారడంతో ప్రతిక్షణం విలువైనదేనని, శిబిరాలకు గాని, వేరే అద్దెఇళ్లకు గాని వెళ్లాలని అధికారులు చెబుతున్నా వారు ఒకపట్టాన వినడం లేదు. విచక్షణారహిత పనులతో తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, పుట్టిపెరిగిన ఊరుతో భావోద్వేగ బంధాన్ని తెంచుకుని ఎలా తరలివస్తామని ప్రశ్నిస్తున్నారు. శిబిరాలకు తరలివెళ్లినవారు వెనక్కి వస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి సమకూర్చుకున్న గూడును ఎలా వీడిపోతామని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడికో వెళ్లే బదులు అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోతామని కొందరు స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు.

ప్రమాదకర ఇళ్లపై ఎర్రరంగు గుర్తు
కొత్తగా మరో 68 ఇళ్లలో పగుళ్లు కనిపించడంతో ఇప్పటివరకు 678 నివాసాలు ప్రభావితమైనట్లయింది. వీటన్నింటిపై ఎర్రరంగు గుర్తులు వేసి, అవి నివాసయోగ్యం కావని హెచ్చరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్లకు వీటిని అంటించారు. రాబోయే ఆరు నెలల కాలానికి నెలకు రూ.4,000 అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ ప్రకారం వేరే ఇళ్లకైనా మారాలని ప్రజల్ని ఒప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

.

ఎన్టీపీసీ పనుల నిలిపివేతకు ఆదేశం
జోషీమఠ్‌ ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించడంతో పాటు నిర్మాణ పనులపై నిషేధం విధించామని చమోలీ కలెక్టర్‌ హిమాన్షు ఖురానా తెలిపారు. ఎన్టీపీసీకి చెందిన తపోవన్‌-విష్ణుగడ్‌ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర విచారణకు చేపట్టే విషయాన్ని సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. సహాయ పునరావాస చర్యల్లో స్థానిక యంత్రాంగానికి తోడ్పాటు అందించేందుకు వీలుగా 'జాతీయ విపత్తు స్పందన దళం' (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాన్ని అందుబాటులో ఉంచారు.

జాతీయ విపత్తుగా ప్రకటించండి: కాంగ్రెస్‌
జోషీమఠ్‌ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ ప్రాంతంలో అన్నిరకాల అభివృద్ధి పనుల్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. నియంత్రణలేని పనులవల్లనే ఇళ్లు దెబ్బతింటున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details