తెలంగాణ

telangana

ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?

By

Published : Nov 18, 2020, 7:02 AM IST

సాధారణంగా ఏ ఊర్లోనైనా కొడుకుల వంశాలే ఉంటాయి. అల్లుళ్ల కుటుంబాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే.. ఓ గ్రామం ఇందుకు భిన్నం. ఆ ఊరి ఆడబిడ్డను వివాహమాడిన వారు అక్కడికే వెళ్లి స్థిరపడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఊరు ఊరే అల్లుళ్లమయమై ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? దానికి ఎందుకంత ప్రత్యేకత? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

JHARKHAND JAMAIPARA VILLAGE SPECIALITY FOR THE SON-IN-LAWS
ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?

అల్లుళ్లతో ప్రత్యేకతను చాటుకుంటోన్న జమైపడా గ్రామం

ఇక్కడ కనిపిస్తున్న గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఊర్లో నివసించేవారి వల్లే ఆ ప్రత్యేకత వచ్చింది. వాళ్లే అల్లుళ్లు. వివాహం చేసుకున్న తర్వాత అత్తామామల స్వస్థలంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవాళ్లే వీరంతా. వారి పేరుమీదుగానే ఈ ఊరికి జమైపడా అనే పేరొచ్చింది. ఝార్ఘండ్‌లోని సరైఖేలా జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఆసంగి, బర్‌గిడీ గ్రామాల మధ్యలో నెలకొన్న జమైపడా పారిశ్రామిక ప్రాంతానికి దగ్గర్లో ఉంటుంది.

"ఈ ఊరిపేరు జమైపడా. ఉద్యోగాలు, ఉపాధి కోసం చాలామంది ఇక్కడే స్థిరపడ్డారు."

- గౌరంగో ప్రధాన్, అల్లుడు, జమైపడా

"ఆసంగీ, బర్‌గిఢీ గ్రామాలకు మధ్యలో జమైపడా ఉంటుంది. ఇక్కడ ఉండేవారిలో ఎక్కువ శాతం అల్లుళ్లే."

- చింతామణి ప్రధాన్, మామ, జమైపడా

1967లో ఈ ప్రాంతంలో తీవ్ర కరవు వచ్చినట్లు చెప్తారు. ఆ సమయంలో తమ భూములను ఇంటి అల్లుడికి దానంగా ఇస్తే వర్షాలు కురుస్తాయని, మంచి జరుగుతుందని ఓ పండితుడు చెప్పడం వల్ల గ్రామస్థులంతా అలాగే చేస్తారు. 30 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్దఎత్తున పరిశ్రమలు వెలిశాయి. అప్పటినుంచీ, ఉద్యోగావకాశాల కోసం పెళ్లి తర్వాత అల్లుళ్లందరూ జమైపడాలోనే స్థిరపడిపోయారు.

"నా భర్త సొంతూరు చక్రధర్‌పూర్. అక్కడ మాకంటూ ఏమీ లేదు. పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాం."

- సురుమని దేవీ, జమైపడా వాసి

"నేనీ ఊరిలో స్థిరపడి 30 ఏళ్లు దాటింది. అప్పట్లో ఇక్కడెవరూ ఉండేవారు కాదు. క్రమంగా ఊరి అల్లుళ్లే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు."

- బుధేశ్వర్ ప్రధాన్, అల్లుడు, జమైపడా

"30 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఊరి అల్లుళ్లంతా ఇక్కడికే మకాం మార్చారు. పెళ్లైన తర్వాత కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. కొంతమందికి అల్లుళ్లే ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఎక్కువమంది అల్లుళ్లే ఉండటంతో ఈ ఊరికి జమైపడా అనే పేరొచ్చింది."

- కృష్ణ ప్రధాన్, సామాజిక కార్యకర్త

గతంలో ఈ ఊర్లో వందల సంఖ్యలో ఇళ్లుండేవి. కానీ.. ప్రస్తుతం ఇక్కడ నివాసముంటున్న గ్రామస్థుల సంఖ్య 150కి పడిపోయింది. ఈ రోజుల్లో భార్య కుటుంబసభ్యులతో కలిసి ఉండేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. ఏది ఏమైనా.. పెళ్లి తర్వాత, తమ భార్య తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బతికే సంప్రదాయం అభినందనీయం. దాంట్లో తప్పేముంది.?

ఇదీ చదవండి:అయోధ్య దీపోత్సవ ధగధగలకు గిన్నిస్​ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details