తెలంగాణ

telangana

కశ్మీర్​లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

By

Published : Jul 19, 2023, 2:05 PM IST

Updated : Jul 19, 2023, 2:33 PM IST

Jammu Kashmir flood 2023 : జమ్ము కశ్మీర్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కథువా జిల్లాలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

jammu-kashmir-flood-2023
jammu-kashmir-flood-2023

Jammu Kashmir flood 2023 : వరదల ధాటికి జమ్ము కశ్మీర్​లోని ఒక్క జిల్లాలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కథువా జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని వెల్లడించారు. స్థానికులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.

విరిగిపడ్డ కొండచరియలు

ఎడతెరపి లేని వర్షాల కారణంగా కథువా జిల్లాలోని బానీ గ్రామంలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, గ్రామస్థులు కలిసి శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాంబన్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దోడ, కిశ్త్​వాడ్ జిల్లాల్లోనూ పాఠశాలలు మూతపడ్డాయి.

కూలిన ఇల్లు

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కత్రాలో అత్యధికంగా 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైనట్లు తెలిపారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపైకి బురద, రాళ్లు చేరుకోవడం వల్ల ట్రాఫిక్​ స్తంభించిందని వెల్లడించారు.

జమ్ము కశ్మీర్​లో భారీ వర్షాలు

ఉధంపుర్ జిల్లాలోని కల్లార్​ ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మంగళవారం జరిగిందీ ఘటన.
మరోవైపు, గాందర్​బల్​లోని ప్రభుత్వ కళాశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ రాష్ట్రాల్లోనూ...
ఉత్తర భారతంలోని వివిధ రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం నీటి మట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని మించింది. నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తాజ్​మహల్ సమీపానికి వరద నీరు చేరుకుంది. మరో మూడు రోజుల వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని తెలిపారు.

Last Updated : Jul 19, 2023, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details