తెలంగాణ

telangana

కాలువలో దొరికిన చిన్నారికి కొత్త జీవితం.. 'టైగర్​'ను దత్తత తీసుకున్న ఇటలీ జంట

By

Published : Feb 19, 2023, 3:38 PM IST

Updated : Feb 19, 2023, 4:42 PM IST

italy couple adapted a baby
italy couple adapted a baby

అప్పుడే పుట్టిన ఓ పసికందును ప్లాస్టిక్​ కవర్లో చుట్టి కాలువలో పడేశాడో వ్యక్తి. ఆ పసికందు గురించి తెలుసుకున్న ఓ ఫౌండేషన్ వారు​ గాయాలతో ఉన్న ఆ చిన్నారిని బయటకు తీసి.. దాదాపు నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పూర్తిగా కోలుకున్న ఆ చిన్నారిని వారే దగ్గరుండి బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. ఈ హృదయ విదారక ఘటన నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగింది. అయితే ఇప్పుడా చిన్నారిని దత్తత తీసుకోవడానికి ఓ ఇటలీ జంట ముందుకు వచ్చింది.

నాలుగేళ్ల క్రితం.. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఓ వ్యక్తి కాలువలో పడేశారు. ఆ చిన్నారిని బయటకి తీసి చికిత్స అందించిందో సేవా సంస్థ. ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ బాబుకు.. ఇటలీకి చెందిన ఓ జంట కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. దీంతో ఆ చిన్నారి విషయం వెలుగులోకి వచ్చింది. 2018లో మహారాష్ట్రలోని ఠాణెలో జరిగిందీ ఘటన. అయితే మృత్యువుని జయించిన ఆ నవజాత శిశువును కాపాడిన ఫౌండేషన్​ వారు.. ఆ చిన్నారికి 'టైగర్'​ అనే పేరు పెట్టారు. టైగర్​ గురించి తెలిసుకున్న ఇటలీ జంట.. దత్తత ప్రక్రియకు కావలసిన అన్ని నియమాలను పూర్తి చేసి ఇటలీకి పయనమైంది. మరి టైగర్​ కథేంటో తెలుసుకుందామా మరి..!

అసలేం జరిగిందంటే..!
2018 డిసెంబర్​ 30న ఠాణె.. ఉల్హాస్​నగర్​ ప్రాంతంలోని వడోల్​ గ్రామంలో ఉన్న కాలువలో.. అప్పుడే పుట్టిన పసికందు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సామాజిక కార్యకర్త, అశోక ఫౌండేషన్​కు చెందిన శివాజీ రాగ్దేకు ఈ విషయాన్ని చెప్పారు. అక్కడికి చేరుకున్న శివాజీ దంపతులు తీవ్ర గాయాలతో ఉన్న శిశువును బయటకు తీశారు. వెంటనే దగ్గర్లోని సెంట్రల్ ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శిశువును కాలువలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ చిన్నారి తలకు తీవ్ర గాయం అవ్వడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో శివాజీ అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేల సహాయంతో.. ఆ పసికందును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ ఆస్పత్రికి తీసుకువెళ్లిన 24 గంటల్లోనే దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేసి తలకు శస్త్ర చికిత్స చేయించారు శివాజీ.

అయినా సరే చిన్నారి చికిత్సకు మరికొంత డబ్బులు అవసరం అయ్యాయి. దీంతో అశోక ఫౌండేషన్​ వారు.. కిటో అనే ఓ ఎన్​జీఓతో ఒప్పందం చేసుకుని చికిత్స చేయించారు. దాదాపు 18 రోజుల తర్వాత చిన్నారి ఆరోగ్యం కాస్త కుదుటపడగా.. శివాజీ ఆ బాబుకు 'టైగర్'​ అని పేరు పెట్టారు. దాదాపు 4 నెలల చికిత్స అనంతరం 2019 ఏప్రిల్​ 5న టైగర్​ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ​

టైగర్​ను తీసుకువెళ్తున్న ఇటలీ దంపతులు

ఆ తర్వాత మహిళా బాలకల్యాణ సమితి ఆదేశాల మేరకు శివాజీ, ఆయన భార్య జయశ్రీ రాగ్దేలు టైగర్​ను విశ్వ బాలక్​ కేంద్రంలో చేర్పించారు. అనంతరం శివాజీ దంపతులు ప్రతి వారం వెళ్లి టైగర్​ను కలిసే వారు. అయితే నాలుగేళ్ల టైగర్ గురించి తెలిసిన ఓ ఇటలీ జంట.. ఆ బాబును దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం దత్తత ప్రక్రియకు కావల్సిన అన్ని నియామాలను పూర్తి చేసి.. ఫిబ్రవరి 17న టైగర్​ను తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఇటలీ దేశస్థుడిగా మారిన టైగర్​ను కలిసేందుకు శివాజీ దంపతులు సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. మృత్యువుతో పోరాడిన టైగర్​కు తాము చేయగలిగినంత చేసామని వారు కొత్త తల్లిదండ్రులకు తెలిపారు. టైగర్​కు మంచి తల్లిదండ్రులు దొరికారని.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ.. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు శివాజీ దంపతులు. అనంతరం టైగర్​, అతని కొత్త తల్లిదండ్రులు ఇటలీకి పయనమయ్యారు.

Last Updated :Feb 19, 2023, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details