తెలంగాణ

telangana

ఆ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు.. దేశవ్యాప్తంగా సోదాలు.. బంగాల్ మంత్రికి సీబీఐ సెగ

By

Published : Sep 7, 2022, 11:23 AM IST

it raids in india
it raids in india

ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, బంగాల్​ మంత్రి మొలోయ్‌ ఘఠక్​కు చెందిన ప్రాంతాలపై సీబీఐ సోదాలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలు పార్టీలు నిధులు తప్పుగా చూపిస్తున్నాయన్న అనుమానాలతో ఈ చర్యలకు దిగినట్లు స్పష్టం చేశాయి. గుజరాత్, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. రాజకీయ పార్టీలతో పాటు వాటితో సంబంధం ఉన్న సంస్థలు, నిర్వాహకులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.

ఎన్నికల సంఘం సిఫార్సు ప్రకారం ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈసీ 87 పార్టీలపై చర్యలు తీసుకుంది. రిజిస్టర్డ్ జాబితా నుంచి వాటిని తొలగించింది. వెరిఫికేషన్ సమయంలో వాటి జాడ తెలియలేదని తెలిపింది. రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని 2,100 రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించింది. ఎన్నికల చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించింది. పలుపార్టీలు తీవ్ర ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్లు తెలిపింది.

బంగాల్ మంత్రికి సీబీఐ సెగ
బంగాల్‌లో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాఠశాల ఉద్యోగాల నియామక కుంభకోణంలో అరెస్టై పార్థా ఛటర్జీ మంత్రి పదవి కోల్పోగా... చిట్‌ఫండ్‌ స్కామ్‌లో ఎమ్మెల్యే సుబోధ్‌ అధికారి ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. తాజాగా న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘఠక్ నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)దాడులు నిర్వహిస్తోంది. అసన్‌సోల్‌లోని ఘఠక్‌కు చెందిన 3 నివాసాలతోపాటు, కోల్‌కతాలోని 4 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన పాత్రపై విచారణ జరిపేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. తనిఖీల వేళ నివాసాల వద్ద భారీగా కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఘఠక్‌ ఇంట్లో లేరని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. బంగాల్‌లో బొగ్గు కుంభకోణంపై తృణముల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ.. ఆయన సతీమణితోపాటు పలువురు బంధువులను ఈడీ విచారించింది.

ABOUT THE AUTHOR

...view details