తెలంగాణ

telangana

ఫేస్‌బుక్‌ లవ్​.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

By

Published : Jul 24, 2023, 11:47 AM IST

Updated : Jul 24, 2023, 5:04 PM IST

India Woman Going Pakistan : ప్రియుడిని కలిసేందుకు పాకిస్థాన్​కు వెళ్లింది రాజస్థాన్​కు చెందిన ఓ మహిళ. తన భార్య జైపుర్ వెళ్తున్నానని చెప్పి.. పాకిస్థాన్ వెళ్లిపోయిందని అన్నారు వివాహిత భర్త అరవింద్​. ఫేస్​బుక్​లో పరిచయమైన ప్రియుడు కోసం వివాహిత పాక్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అంజుతో తనకు స్నేహబంధమే ఉంది గానీ.. ప్రేమబంధం లేదని ఆమె స్నేహితుడు నస్రుల్లా చెప్పాడు.

india woman going pakistan
india woman going pakistan

India Woman Going Pakistan : పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం తన నలుగురు పిల్లలతో కలసి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ఉదంతం మరువకముందే ఆ తరహా ఘటన మరొకటి జరిగింది. ఈ సారి ఓ భారతీయ మహిళ ఫేస్‌బుక్‌ స్నేహితుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్​ వెళ్లింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Anju Nasrullah Love Story : అంజు(34), అరవింద్​ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లోపాకిస్థాన్​కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు గురువారం వాయవ్య పాకిస్థాన్​లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటం వల్ల ఆమెను విడిచిపెట్టారు.

Anju Pakistan News : జైపుర్​లో ఉన్న స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్నానని చెప్పి.. తన భార్య పాకిస్థాన్​ వెళ్లిపోయిందని మహిళ అంజు భర్త అరవింద్​ కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆదివారం రాత్రి నా భార్య అంజు.. వాయిస్ కాల్ చేసింది. లాహోర్​లో ఉన్నానని చెప్పింది. ఆమె పాకిస్థాన్​ ఎందుకు వెళ్లిందో? వీసా ఎలా పొందిందో నాకు తెలియదు. నా భార్య ఫోన్​లోని మెసేజ్​లను నేనెప్పుడూ తనిఖీ చేయలేదు. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదు. నా భార్య అంజు తిరిగివచ్చాక ఆమెతో కలిసి ఉండాలో? లేదో? నా పిల్లలు నిర్ణయిస్తారు. అంజు నాకు తెలియకుండా బయటకి వెళ్లడం ఇదే మొదటిసారి. నా భార్య నన్ను మోసం చేసింది' అని అరవింద్ చెప్పుకొచ్చారు.

మా ఇద్దరిది స్నేహమే.. ప్రేమ కాదు..
అయితే, అంజును పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ఆమె ఫేస్​బుక్ స్నేహితుడు, పాక్​కు చెందిన నస్రుల్లా చెప్పాడు. వీసా గడువు ముగిసిన తర్వాత.. అంటే ఆగస్టు 20న అంజు.. భారత్​కు వెళ్తుందని తెలిపాడు. 'అంజు నా ఇంట్లో నా మహిళా కుటుంబ సభ్యులతో ప్రత్యేక గదిలో నివసిస్తోంది. అంజుతో నాకు స్నేహమే ఉంది. ప్రేమ లేదు' అని నస్రుల్లా వెల్లడించాడు.

రాజస్థాన్​కు చెందిన వివాహితురాలు.. పాకిస్థాన్ వెళ్లడంపై భివాడీ ఏఎస్పీ సుజిత్ శంకర్ స్పందించారు. ఫేస్​బుక్​, వాట్సాప్​ ద్వారా పాక్​కు చెందిన వ్యక్తితో అంజు 2-3 ఏళ్లుగా టచ్‌లో ఉందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.

"జులై 21న ఆమె పాకిస్థాన్​కు వెళ్లింది. ప్రియుడిని కలిసేందుకే ఆమె పాక్ వెళ్లి ఉండొచ్చు. కానీ పక్కా ఆధారాలు దొరికే వరకు ఏం చెప్పలేం. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాబట్టి అధికారికంగా విచారణ చేపట్టలేదు."
-సుజిత్ శంకర్, భివాడీ ఏఎస్పీ

Last Updated :Jul 24, 2023, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details