తెలంగాణ

telangana

సరిహద్దులో అలజడికి పాక్ కుట్ర.. 200 మంది ముష్కరులతో ప్లాన్!.. దేనికైనా సిద్ధమంటున్న భారత ఆర్మీ!

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 7:39 PM IST

India Pakistan Cross Border Terrorism : ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న పాకిస్థాన్ మన దేశంలో అశాంతిని రాజేసేందుకు ప్రయత్నిస్తోందని నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మండిపడ్డారు. భారత్‌లో చొరబాటు కోసం పాక్‌ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని ఆరోపించారు. మన బలగాలు అప్రమత్తంగా ఉండటంతో వారి ఆటలు సాగడం లేదని వివరించారు. సరిహద్దుల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.

india-pakistan-cross-border-terrorism
india-pakistan-cross-border-terrorism

India Pakistan Cross Border Terrorism : సరిహద్దుల్లో మరోసారి అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. జమ్మూ ఐఐటీలో నిర్వహించిన నార్త్‌ టెక్నో సింపోజియం-2023లో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను సమర్థంగా అడ్డుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో సాధారణ పరిస్థితి కొనసాగుతోందని, అంతా బాగుందని వివరించారు. రాష్ట్రీయ రైఫిల్‌ దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని ద్వివేది తెలిపారు.

భారత్‌లో చొరబాటు కోసం పాక్‌ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని ద్వివేది వెల్లడించారు. భారత భద్రతా దళాల అప్రమత్తత కారణంగా వారి ఆటలు సాగడం లేదని అన్నారు. గత 9 నెలల వ్యవధిలో 46 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. అందులో 37 మంది విదేశీయులు కాగా.. 9 మంది స్థానికులుగా గుర్తించామని తెలిపారు. ఆర్థిక సంక్షోభం, ఇతర సమస్యలతో సతమతమవుతున్న పాక్‌.. భారత్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోందని విమర్శించారు. సరిహద్దులోని జిల్లాలైన రాజౌరి, పూంఛ్​లలో ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోస్తోందని ధ్వజమెత్తారు. విద్రోహ శక్తులు డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీతో ఆ కార్యకలాపాలకు చెక్‌ పెడుతున్నామని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే రాష్ట్రపతి భవన్​పై దాడికి ఉగ్రవాదులు పథక రచన చేసినట్లు ఇటీవల దర్యాప్తు అధికారులు గుర్తించారు. భారత్​లో ఉంటూ పాకిస్థాన్​కు గూఢచారిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా.. ఈ విషయం వెల్లడైంది. బిహార్​కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్​కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) డిటెక్టివ్‌లు.. బిహార్​కు వెళ్లి అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. దిల్లీ, కోల్​కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన చిత్రాలను తీసి అతడి పాకిస్థాన్​కు పంపినట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details