తెలంగాణ

telangana

యునెస్కో జాబితాలో ధోలావీరా- వారసత్వ సంపదగా గుర్తింపు

By

Published : Jul 27, 2021, 3:46 PM IST

Updated : Jul 28, 2021, 6:26 AM IST

భారత్​లోని మరో చారిత్రక ప్రాంతానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. హరప్పా నాగరికత కాలంలో ఆధునిక నగరంగా విరాజిల్లిన గుజరాత్‌లోని ధోలావిరాకు ఈ ఘనత దక్కింది.

DHOLAVIRA INSCRIBED IN WORLD HERITAGE
ధోలవిరా

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో మరో భారతీయ ప్రాచీన ప్రాంతానికి చోటు దక్కింది. 5 వేల సంవత్సరాలకు పూర్వం హరప్పా నాగరికత కాలంలో ఆధునిక నగరంగా విరాజిల్లిన.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉన్న ధోలావీరాకు ఈ గుర్తింపు ఇస్తున్నట్టు యునెస్కో మంగళవారం ప్రకటించింది.

తెలంగాణలోని 13 శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ రామప్ప ఆలయానికి ఇటీవలే ఈ జాబితాలో చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ధోలావీరాతో కలిపి భారత్‌ నుంచి యునెస్కో జాబితాలో చేరిన చారిత్రక ప్రాంతాలు 40కి చేరాయని కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ధోలావీరాకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతమంటూ ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు.

"కచ్చితంగా ఇది చాలా సంతోషకరమైన వార్త. ధోలావిరా చాలా ముఖ్యమైన పట్టణ కేంద్రం. ప్రతి ఒక్కరూ... ముఖ్యంగా చరిత్ర, సంప్రదాయాలు, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో తొలిసారిగా ధోలావిరాకు వెళ్లాను. ఆ ప్రాంతాన్ని చూసి మైమరచిపోయాను. ఆ తర్వాత గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి అక్కడకు వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ పర్యటకుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా బృందం పనిచేసింది"

-ప్రధాని ట్వీట్

ధోలావీరాకు తాజా గుర్తింపు దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

హరప్పా నాగరికతకు తలమానికం

కచ్‌ జిల్లాలోని బచావూ తాలూకాలో ఉన్న ధోలావీరా ప్రాంతాన్ని స్థానికంగా కోటడ టింబా (పెద్ద కోట) అంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామం పేరు ధోలావీరా. క్రమంగా ఈ పేరే పురాతన ప్రాంతానికీ స్థిరపడింది. హరప్పా నాగరికత (సింధు లోయ నాగరికత)లో సుమారు 1400 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం (2900 బీసీ-1500 బీసీ) నగరంగా వర్దిల్లిన ప్రాంతమిది. 120 ఎకరాలలో చతురస్రాకారంలో దీన్ని నిర్మించారు. ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఇక్కడ ఉండేది. సుమారు 50 వేల మంది నివసించేవారు. హరప్పా నాగరికతలోని ఐదు పెద్ద ప్రాంతాల్లో ఇదే ప్రముఖమైనది. ఆ కాలంలో అత్యంత ధనిక నగరం కూడా ఇదే.

నివాసాల అమరిక, పాలన వ్యవస్థ ఓ క్రమపద్ధతిలో ఉంటుంది. రాజు/పాలకుడు నివసించే రాజ్‌ మహల్‌ను ఎత్తయిన చోట నిర్మించారు. దాని చుట్టూ కోట గోడలు, వాటికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెండో భాగంలో 2-5 గదులతో కూడిన అధికారుల నివాసాలుంటాయి. వీటికీ రక్షణ గోడలున్నాయి. ఇక మూడో భాగంలో సాధారణ ప్రజల నివాసాలున్నాయి. మొత్తం నగరం చుట్టూతా మరో గోడ ఉంటుంది. ఈ నిర్మాణాలన్నింటినీ సమీపంలోని క్వారీల నుంచి తీసిన పొడవాటి రాళ్లతోనే అందంగా నిర్మించారు. నగరానికి ఉత్తరాన మన్సార్‌, దక్షిణాన మాన్హర్‌ నదులు ఉండేవి. నగరంలో నీటి నిల్వ, సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ఏర్పాట్లున్నాయి. ముత్యాలు తయారుచేసే పెద్ద కర్మాగారాన్ని ఇక్కడ కనుగొన్నారు. 1967లో పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని గుర్తించి తవ్వకాలు ప్రారంభించింది. అయితే 1990 తర్వాతే తవ్వకాలు ఓ క్రమపద్ధతిలో జరిగి మొత్తం నగర స్వరూపం తెలిసొచ్చింది. తవ్వకాలలో రాగి పాత్రలు ఎక్కువగా బయటపడ్డాయి. ఇక్కడ లభ్యమైన శిలాశాసనాలను ప్రపంచంలోనే తొట్టతొలి శాసనాలుగా భావిస్తారు.

ఇదీ చూడండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

Last Updated : Jul 28, 2021, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details