తెలంగాణ

telangana

'కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. వారు మాత్రం ట్వీట్లకే పరిమితం.. అందుకే ఇలా..'

By

Published : Sep 4, 2022, 1:52 PM IST

GULAM NABI AZAD
GULAM NABI AZAD

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పరోక్షంగా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. తనను అగౌరపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ట్వీట్లకే పరిమితమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై ప్రకటన చేశారు.

కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌.. తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో కొత్త పార్టీపై ప్రకటన చేశారు. దిల్లీ నుంచి ఆదివారం బయల్దేరిన ఆయన.. ఉదయం 11 గంటలకు జమ్ముకు చేరుకున్నారు. ఆయన అనుచరులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

'పార్టీకి హిందుస్థానీ పేరు..'
కశ్మీర్​కు రాష్ట్ర హోదాపై తన పార్టీ పనిచేస్తుందని ఆజాద్ తెలిపారు. భూములు, ఉద్యోగాలపై హక్కులు స్థానికులకే ఉండేలా పోరాడతామని చెప్పారు. 'పార్టీకి ఇప్పుడే ఇంకా పేరు నిర్ణయించలేదు. పార్టీ పేరు, జెండా గుర్తులను ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. అందరికీ అర్థమయ్యే హిందుస్థానీ పేరునే పార్టీకి పెడతాం' అని ఆజాద్ తెలిపారు.

వారు ట్వీట్లకే పరిమితం
ఈ సందర్భంగా హస్తం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్.. తమ రక్తంతో తయారైందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొందరు తనను అగౌరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలన్నీ కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితమవుతాయని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు.

'మా రక్తంతో కాంగ్రెస్ తయారైంది. కంప్యూటర్లు, ట్విట్టర్ ద్వారా పార్టీ తయారు కాలేదు. కొందరు మమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ కంప్యూటర్లు, ట్విట్టర్​కే పరిమితమవుతాయి. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడానికి కారణం అదే. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారు. డీజీపీ, కమిషనర్లకు ఫోన్ చేసి తమ పేర్లు రాయించుకొని గంటలో బయటకు వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది' అని ఆజాద్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details