తెలంగాణ

telangana

ఆవుపేడతో పెయింట్​- దిగ్గజ సంస్థల్లో ఉద్యోగం వదిలేసి యువకుడి స్టార్టప్​

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 10:42 AM IST

Updated : Nov 15, 2023, 11:46 AM IST

Gobar Paint Jharkhand : మెకానికల్ ఇంజినీరింగ్‌ చదివాడు... ఎన్నో బహుళజాతి సంస్థల్లో మంచి హోదాల్లో ఉద్యోగాలూ చేశాడు. అయినా ఏదో తెలియని అసంతృప్తి ఆ యువకుడిలో. విభిన్నతను చాటేలా ఇంతకు మించి ఏదో చెయ్యాలి అనుకున్నాడు. పర్యావరణానికి, పేదలకు మేలు చేకూర్చే ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టాలని సంకల్పించాడు. అందుకు తగినట్లుగానే ప్రకృతిహితమైన ఆవుపేడతో పెయింట్‌ తయారు చేస్తూ.. మంచి ఫలితాలు పొందుతున్నాడు. ఆ స్టార్టప్‌ విశేషాలేంటో మనమూ చూసేద్దాం పదండి.

Man Making Paint With Dung
Man Making Paint With Dung

ఆవుపేడతో పెయింట్​- దిగ్గజ సంస్థల్లో ఉద్యోగం వదిలేసి యువకుడి స్టార్టప్​

Gobar Paint Jharkhand :ఆవు పేడతో ఎన్నెన్ని లాభాలున్నాయో మనకు తెలియంది కాదు. ఒక ఇంధనంగా, ఎరువుగా, బయోగ్యాస్‌ తయారీలో... ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. మన ముందు తరాలవాళ్లయితే... ఇల్లు, గోడలను పేడతో అలకడాన్ని సంప్రదాయంగా పాటించేవారు. ఇది క్రిమిసంహారకంగా పనిచేస్తుందని నమ్మేవారు. ప్రస్తుతం సింథటిక్‌ పెయింట్‌లనే అందరూ వాడుతున్నారు. దానికి బదులుగా రసాయనరహితమైన ఆవుపేడతో పెయింట్‌ తయారు చేస్తున్నాడు ఝార్ఖండ్‌కు చెందిన అభిషేక్‌ సింగ్‌.

పేడతో తయారు చేసిన పెయింట్​తో అభిషేక్ సింగ్​

కాలానుగుణంగా పల్లెలు, పట్టణాల్లోనివారు ఈ సంస్కృతులకు దూరమయ్యారు. ఇప్పుడు అభిషేక్‌ స్టార్టప్‌ కారణంగా... రాంచీ, ధన్‌బాద్‌లాంటి నగరాల్లోనూ పేడతో తయారయ్యే పెయింట్‌ను విరివిగా వాడుతున్నారు. తాము చేస్తున్న ప్రాకృతిక్‌ పెయింట్‌ చౌక ధరకే లభ్యమవడమే కాకుండా... మన్నికలోనూ దేనికీ తీసిపోదంటున్నాడీ యువకుడు. పర్యావరణ పరిరక్షణతో పాటు, పశుకాపరుల ఉపాధికీ కృషి చేస్తున్నాడు.

పెయింట్​ను తయారు చేస్తున్న కార్మికులు

బహుళజాతి సంస్థలో పనిచేసినా..
ధన్‌బాద్‌కు చెందిన అభిషేక్‌ సింగ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. భూషణ్ స్టీల్, జిందాల్, వేదాంతలాంటి బహుళజాతి కంపెనీల్లో పనిచేసినా... ఏదో తెలియని అసంతృప్తి. ప్రజలకే కాకుండా పర్యావరణానికి మేలు చేసేలా ఓ స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. విభిన్నంగా ఆలోచించి... ప్రాకృతిక్‌ పెయింట్‌ కంపెనీని మొదలుపెట్టాడు. ఆ వివరాలేంటో తన మాటల్లోనే విందాం.

పెయింట్​ను తయారు చేస్తున్న కార్మికులు

"ప్రాకృతిక పెయింటింగ్‌ గురించి మేం యూట్యూబ్‌, ఇంటర్నెట్‌లో చూశాం. ఇవి చాలా విభిన్నమైన ఉత్పత్తులు. ఆవు పేడతో చిత్రలేఖనం వేసేవారు, కానీ పెయింట్ తయారీ గురించి ఎవరూ ఆలోచించలేదు. ఈ దిశగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ ముందడుగు వేశారు. ఆవు పేడతో పెయింట్‌ తయారీ విభిన్నంగా ఉంటుంది, దాన్ని మేం కూడా చేయాలని భావించాం. తద్వారా ఉపాధి కూడా కల్పించవచ్చని భావించాం. దీనికి సంబంధించి జైపుర్‌లో కుమారప్ప సంస్థలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాం. ఆవు పేడ తయారీ కేంద్రం ఎలా ఏర్పాటు చేయాలి. సామాగ్రి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే అంశంపై అక్కడి నుంచి మేం సమాచారం సేకరించాం. ఆ తర్వాత ధన్‌బాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం."
--అభిషేక్ కుమార్‌ సింగ్, స్టార్టప్‌ యజమాని

జైపుర్​లో శిక్షణ తీసుకుని..
జైపుర్‌లోని కుమరప్పలో శిక్షణ అనంతరం... PMEGP కింద పొందిన బ్యాంకు రుణంతో 2022లో ధన్‌బాద్‌లో సొంత ఫ్యాక్టరీ తెరిచాడు అభిషేక్‌. పశువుల మేతకు అక్కరకొచ్చేలా... కిలో ఆవుపేడకు 5 రూపాయల చొప్పున పశుకాపర్ల నుంచి కొనుగోలు చేస్తున్నాడు. ఒకప్పుడు పశుపోషణ భారంగా భావించినవారికి బాసటగా నిలుస్తున్నాడు. దీంతో పాలివ్వడం మానేసినా.. పశువులను రోడ్లపై వదలివేయటం వేయటంలేదని చెబుతున్నాడు.

పెయింట్​ను తయారు చేస్తున్న కార్మికులు
పేడతో తయారు చేసిన పెయింట్​

Gobar Paint Manufacturing Process : ప్రాకృతిక్‌ పెయింట్‌ సహజంగా తయారైనట్లు బీఐఎస్‌ ధృవీకరణ పొందింది. సింథటిక్ పెయింట్‌లలాగే 1000 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. ఇతర పెయింట్ల కంటే ధర కూడా చాలా తక్కువ. అంతేకాకుండా ఇది గోడలపై ఐదేళ్లపాటు అలాగే నిలిచి ఉంటుందనీ.. నీటితో శుభ్రమూ చేసుకోవచ్చంటున్నాడు అభిషేక్‌. ఆవుపేడతో పెయింట్‌ తయారీ విధానం గురించి ప్రాకృతిక్‌ పెయింట్‌లో పనిచేస్తున్న సురేశ్ మాటల్లోనే తెలుసుకుందాం.

ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం

"పెయింట్‌ తయారీలో భాగంగా మొదట పేడను మిక్సీలో వేస్తాం. మిక్సీ నుంచి నీటితో కలిసి పైపు ద్వారా అది బాయిలర్‌కు వెళుతుంది. బాయిలర్‌లో పేడను 90డిగ్రీల వద్ద వేడి చేస్తాం. ఆ తర్వాత దాన్ని వేరే ప్రదేశంలో నిల్వ చేసి పేడలోని సి.ఎం.సిని తొలగిస్తాం. ద్రవ రూపంలోకి మారిన తర్వాత పేడలో సి.ఎం.సి కనీస పరిమితి 20శాతం ఉండేలా చేస్తాం. దానిలో గట్టి సున్నం లాంటివి వేస్తాం. మామూలు పెయింట్‌లో రసాయనాలు ఆధారంగా ఉంటాయి. కాని మా పెయింట్‌కు పేడ ఆధారంగా ఉంటాయి."
--సురేశ్, కార్మికుడు

ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం
ఏడాది కిందటే ప్రారంభించినా... రోజుకు సగటున 2 వేల లీటర్ల పెయింట్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు అభిషేక్‌. ప్రస్తుతం వార్షికాదాయం రూ. 5 నుంచి 6 లక్షల వరకు ఉంది. దీనికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని... భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్​

చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ

Last Updated :Nov 15, 2023, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details