తెలంగాణ

telangana

G20 Summit Delhi : జీ20 సదస్సు షురూ.. ఆ సమస్యలకు పరిష్కారాలే లక్ష్యంగా చర్చలు

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 10:52 AM IST

Updated : Sep 9, 2023, 1:50 PM IST

G20 Summit Delhi : భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు దిల్లీ ప్రగతి మైదాన్​లో శనివారం ఉదయం ప్రారంభమైంది. సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రపంచ దేశాధినేతలతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు.

G 20 Summit Delhi
G 20 Summit Delhi

జీ20 సదస్సు

G20 Summit Delhi : ద్రవ్యోల్బణం, మాంద్యం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా జీ-20 సదస్సు దిల్లీలో శనివారం ఉదయం ప్రారంభమైంది. మొరాకో భూకంపంపై విచారం వ్యక్తం చేస్తూ.. ఆతిథ్య దేశాధినేత హోదాలో సదస్సును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూకంప మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అగ్రరాజ్యాధినేతలు తరలివచ్చిన వేళ.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రెండు రోజులపాటు కీలక చర్చలు జరగనున్నాయి. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్‌ ఈ సదస్సు నిర్వహిస్తోంది. జీ20 సభ్యదేశాలతోపాటు.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌ను కూడా సదస్సు కోసం భారత్‌ ఆహ్వానించింది.

ప్రపంచ దేశాధినేతలకు మోదీ ఘన స్వాగతం
G20 Modi News : అంతకుముందు జీ 20 సమావేశానికి హాజరయ్యే అతిథులకు ఘన స్వాగతం పలికేందుకు సదస్సు జరిగే భారత మండపానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత వచ్చిన ప్రపంచ దేశాధినేతలతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులకు ఆయన ఘన స్వాగతం పలికారు. ప్రఖ్యాత కోనార్క్​ దేవాలయం ప్రతిమ వద్ద దేశాధినేతలతో ఫొటోలు దిగారు.

జీ 20 అతిథులకు రాష్ట్రపతి సందేశం
సమ్మిళిత మానవాళి అభివృద్ధి కోసం 'వసుధైవ కుటుంబకం' అనే థీమ్​తో.. భారత్​ జీ20 సమావేశాలను నిర్వహిస్తోందన్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. దిల్లీలో జీ 20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో తన సందేశాన్ని తెలిపారు. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వారందరికీ స్వాగతం తెలిపారు.

G 20 Summit Agenda :భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపే దిశగా చర్చలు జరగనున్నాయి. సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై సదస్సు దృష్టిసారించనుంది. చైనా, రష్యా.. అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్‌ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. సదస్సులో ముఖ్యంగా... ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్‌ డెవలప్‌మెంట్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై దృష్టిసారిస్తారు. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పేద దేశాలను ఆదుకోవడానికి, అభివృద్ధి కొనసాగడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బ్యాంకులను సంస్కరించి, బలోపేతం చేయాలని జీ-20 కూటమి భావిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా తలెత్తే పరిణామాలపై చర్చలు జరగనున్నాయి.

G20 Summit Resolution : ఇదే సమయంలో జీ-20 అధ్యక్ష పాత్రలో భారత్‌ పలు ప్రతిపాదనలు చేయనుంది. సమ్మిళిత వృద్ధి, డిజిటల్‌ ఆవిష్కరణ, వాతావరణ మార్పులు, అందరికీ సమాన ఆరోగ్య అవకాశాలపై చర్చ కోరనుంది. ఆర్థిక నేరస్థులు ఏ దేశంలో ఉన్నా వారిని కట్టడి చేయడం, అప్పగించడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ఒప్పందానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని జీ-20 సభ్యదేశాలపై ఒత్తిడి చేయనుంది. ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి- ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు నినాదంగా.. భారత్‌ ఈ సదస్సు నిర్వహిస్తుండగా, ఈ నినాదాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ప్రశంసించారు. ఉపనిషత్తుల్లోని సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు.

Last Updated :Sep 9, 2023, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details